Gotta Barrage
-
ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర.. నౌపడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
మనం అధికారంలోకి రాక ముందు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు మాత్రమే ఉన్నాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక, ఈ 46 నెలల కాలంలో మరో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు అప్రూవల్ తీసుకున్నాం. వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకువస్తాం. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి తీర ప్రాంతం వేదిక అవుతుంది. లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి: మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై– కోల్‌కతా నేషనల్ హైవేకు కేవలం 14 కిలోమీటర్లు, ప్రధాన రైల్వే మార్గానికి 11 కిలోమీటర్ల దూరంలో 1,250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న మూలపేట పోర్టు.. రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడే 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని చెప్పారు. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమలు, ఇతరత్రా లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందివచ్చే కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి మండలంలోని నౌపడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే, అందులో ఏకంగా 193 కిలోమీటర్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఉందన్నారు. అయినా ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, కనీసం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఉండి ఉంటే ఈ జిల్లా చెన్నై, ముంబయిగా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ విషయం తెలిసీ కూడా దశాబ్దాలుగా ఎవ్వరూ ఈ దిశగా అడుగులు వేసి, చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. అభివృద్ధికి మూల స్తంభం ► మూలపేట ఇక మూలనున్న గ్రామం కాదు. ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మరో చెన్నై, ముంబయి కాబోతున్నాయి.మూలపేటలో మనం కట్టబోతున్న పోర్టు సామర్థ్యం ఏకంగా ఏడాదికి 24 మిలియన్ టన్నులు. ఈ పోర్టులో 4 బెర్తులు నిర్మిస్తున్నాం. ► ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. దాదాపు రూ.2,950 కోట్ల ఖర్చుతో పోర్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం వంద మిలియన్ టన్నులకు పెరిగే రోజు సమీపంలోనే ఉంది. దీన్ని ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడానికి 14 కిలోమీటర్ల పొడవున రోడ్డు, 11 కిలోమీటర్ల పొడవున రైలుమార్గం నిర్మిస్తున్నాం. ► ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి పైపులైన్ వేసి 0.5 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికీ శ్రీకారం చుడుతున్నాం. ఇలా మౌలిక వసతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర వ్యయాలను కలిపితే మూలపేట పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.4,362 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా. గంగపుత్రుల కళ్లల్లో మరింత కాంతి గంగపుత్రుల కళ్లల్లో మరిన్ని కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింత అండగా ఉండేందుకు మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. మంచినీళ్లపేటలో రూ.12 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి 2019 సెప్టెంబర్‌లో శ్రీకారం చుట్టాం. దాన్ని మరో రూ.85 కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. రైతుల శ్రేయస్సే లక్ష్యం ► వంశధార, నాగావళి నదులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ సస్యశ్యామలం కాని పరిస్థితి. అప్పట్లో దివంగత నేత, నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార ఫేజ్ 2, స్టేజ్ 2 కింద 33 కిలోమీటర్ల పొడవున కాలువల తవ్వకం, హిరమండలం రిజర్వాయర్‌ను 19 టీఎంసీల కెపాసిటీతో నిర్మాణ పనులకు అడుగులు వేగంగా వేయించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆ అడుగులు ముందుకు పడలేదు. ► నేరడి బ్యారేజ్ పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల కెపాసిటీతో నీరు పెట్టడం సాధ్యం కాదు. మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ చూపించారు. ఒడిశాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిసి నేరడి బ్యారేజ్ గురించి మాట్లాడారు. దాని పరిస్థితి అలానే ఉన్నా మధ్యేమార్గంగా మన రైతన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలన్న ఉద్దేశంతో రూ.176.35 కోట్లతో గొట్టా బ్యారేజ్‌పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం. ► మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఆగçస్టు నెలలోనే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. మహానేత రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, మూడు నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.400 కోట్లు ఖర్చయ్యే పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఊరట ► ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మొదలు పెట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌లో ప్రారంభోత్సవం చేస్తాను. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి రూ.700 కోట్లతో నాంది పలికాం. దీన్ని జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. అదే రోజున పాతపట్నం నియోజకవర్గంలో మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ శంకుస్థాపన చేస్తాను. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బేరీజు వేయండి ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేయండి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ► ఈ ప్రాంతంలో ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న విషయం గమనించాలి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి జూన్‌లో శంకుస్థాపన చేస్తాం. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి వీలుగా రూ.6,200 కోట్లతో ఆరు లైన్ల రహదారిని నిర్మించబోతున్నాం. తీర ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి గతంలో ఎందుకు జరగలేదో ఆలోచించండి. సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం ► ఏపీలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ విశాఖలో కాపురం పెడతాడని తెలియజేస్తున్నా. ► ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్కూళ్లు మారుతున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఉన్న ఆస్పత్రులన్నీ రూపురేఖలు మారుతున్నాయి. ► ప్రతి ఇల్లూ అభివృద్ధి కావాలి. నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనపడాలి. 46 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా సొమ్మును నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసింది. ► మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు... కులాలు, కుటుంబ చరిత్రలను మార్చాలన్న తపన, తాపత్రయంతో పని చేస్తున్నాడని గుర్తించాలి. నవరత్నాల పాలనతో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాస్తున్న ప్రభుత్వంగా, ప్రాంతాల చరిత్రలను, పారిశ్రామిక వాణిజ్య చరిత్రను కూడా మారుస్తున్నాం. -
హిరమండలం ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఫేజ్–2, స్టేజ్–2 ఆయకట్టు రైతులకు ముందస్తు ఫలాలను అందించడం.. ఫేజ్–1 స్టేజ్–2 ఆయకట్టు, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టును స్థిరీకరించడం, ఉద్దానం ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా హిరమండలం ఎత్తిపోతలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి రూ.176.35 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ బుధవారం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వంశధార నదిలో గొట్టా బ్యారేజ్ వద్ద నీటి లభ్యతపై 2007 ఆగస్టులో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మళ్లీ అధ్యయనం చేసింది. ఇందులో గొట్టా బ్యారేజ్ వద్ద 105 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో రాష్ట్ర వాటా 52.5 టీఎంసీలు. వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల ద్వారా 34.611 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వాటాలో ఇంకా 17.439 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ నీటిని వాడుకోవడానికి వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. నేరడి బ్యారేజ్ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్‌ను నిర్మించి.. వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్ (19.5 టీఎంసీల సామర్థ్యం)కు మళ్లించి.. వంశధార పాత ఆయకట్టు 2,10,510 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను చేపట్టారు. సైడ్ వియర్ వల్ల ఎనిమిది టీఎంసీలను మాత్రమే హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చు. గొట్టా బ్యారేజ్ నుంచి కుడికాలువ మీదుగా.. నేరడి బ్యారేజ్‌కు వంశధార ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దాన్ని కేంద్రం నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం కోసం భువనేశ్వర్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో దౌత్యం జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను అందించడం కోసం గొట్టా బ్యారేజ్ నుంచి రోజుకు 1,400 క్యూసెక్కుల చొప్పున వందరోజుల్లో 10 నుంచి 14 టీఎంసీలను తరలించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాలని మే 10న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గొట్టా బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతం నుంచి 1,400 క్యూసెక్కులను 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. వంశధార కుడికాలువలో 2.4 కిలోమీటర్ల వద్దకు ఎత్తిపోస్తారు. ఈ నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా 2.5 కిలోమీటర్ల పొడవున కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,265 క్యూసెక్కులకు పెంచుతారు. వందరోజుల్లో 10 నుంచి 12 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. తద్వారా వంశధారలో వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వంశధార స్టేజ్–1, స్టేజ్–2ల కింద 2,55,510 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న 37 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానానికి తాగునీటి కోసం 0.712 టీఎంసీలను సరఫరా చేస్తారు. -
ఎండే అండ! సోలార్ విద్యుత్ దిశగా అడుగులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గొట్టా బ్యారేజీ వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి సోలార్ విద్యుత్ వినియోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి ఇంజినీర్లు మరో అడుగు ముందుకేసి సోలార్ విద్యుత్ ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లు ఖరీఫ్, రబీలో పచ్చని పైరుతో మెరవాలంటే హిరమండలం రిజర్వాయర్‌లో 19.05 టీఎంసీల నీటిని నింపాలి. డెడ్‌స్టోరేజ్‌లో 2.5 టీఎంసీల నీరు ఉంది. ఫ్లడ్‌ఫ్లో కెనాల్, కొండ చరియలు నుంచి వచ్చే నీరంతా కలిపి 4టీఎంసీలు ఉంటుంది. మిగిలిన 12 టీఎంసీల నీటిని నింపాలంటే.. ఒకటి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి నదిలో నీటిని మళ్లించడం, లేక గొట్టాబ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటుచేయడమే మార్గం. అయితే దీనికి వంశధార ఇంజినీర్లు మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వంశధార కుడి కాలువ ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా కాలువను ఆధునీకరించేందుకు డిజైన్లు చేశారు. పాత కాలువ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా దాన్ని మరో వెయ్యి క్యూసెక్కులు అదనంగా నీరు పారేలా కాలువను 10 మీటర్లు వెడల్పు పెంచేందుకు డిజైన్ చేస్తున్నారు. కాలువ సామర్థ్యం పెంచి దానిలోంచి ఎత్తిపోసిన నీటిని హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ ఏర్పాటుకు ప్రణాళిక హిరమండలం రిజర్వాయర్‌లోకి 12 టీంఎంసీల నీటిని నింపేందుకు సాధారణంగా విద్యుత్ వినియోగం 45 మెగావాట్స్ అవ్వవచ్చని నిపుణులు అంచనా. అందుకు సుమారు రూ.25కోట్లు విద్యుత్ చార్జీలు అయ్యే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోయడమనేది వర్షాకాలంలో సుమారు 100 రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఎత్తిపోతల అవసరాలు పూర్తయ్యాక మిగిలిన 9 నెలల కాలంలో సోలార్ విద్యుత్‌ని ప్రజా అవసరాలకు పు ష్కలంగా అందించవచ్చు. దాని వల్ల వచ్చే ఆదా యంతో సోలార్‌ప్లాంట్ నిర్మాణ ఖర్చులు, లిఫ్ట్‌కి అయ్యే విద్యుత్ చార్జీలను రాబట్టుకోవచ్చనే ఓ అంచనా వేస్తున్నారు. సోలార్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద స్థలం అవసరం. హిరమండలం రిజర్వాయర్ ఫోర్‌షోర్, రిజర్వాయర్ గట్టు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. 45 మెగావాట్స్ విద్యుత్ తయారు చేసేందుకు కావాల్సిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకి సుమారు రూ.300కోట్లు ఖర్చు ఉండవచ్చని అంచనా. అయితే ఏటా ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ వినియోగించగా మిగిలిన రోజుల్లో వచ్చే విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చు 8 ఏళ్లలో వచ్చేస్తుంది. ప్లాంట్ నిర్మాణం కంటే రైతులకు ఏటా పండించే పంట అంతకు రెట్టింపుగా ఉంటుంది. సోలార్‌తో ప్రయోజనం అవసరమైన విద్యుత్‌ని సోలార్ నుంచి తీసుకోవడం వల్ల విద్యుత్ లోటు తగ్గుతుంది. లిఫ్ట్ అవసరాలు తీరగా ప్రజా అవసరాలను తీర్చేందుకు అవ కాశం ఉంటుంది. గతంలో భీమవరంలో ఎస్ఈగా పనిచేసిన సమయంలో లోసరి కెనాల్‌పైన సోలార్ సిస్టమ్‌ని ఏర్పాటుచేశాం. ఇప్పటికీ విజయవంతంగానే పనిచేస్తోంది. హిరమండలం రిజర్వాయర్‌లో ఉన్న ఫోర్‌షోర్ ఏరియాలో సోలార్ సిస్టమ్ అమర్చవచ్చు. – డోల తిరుమలరావు, ఎస్ఈ, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, శ్రీకాకుళం -
శ్రీకాకుళంలో వరదల్లో చిక్కుకున్న కూలీలు
-
53 మంది కూలీలు సురక్షితం
సాక్షి, శ్రీకాకుళం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్ వద్ద ఇరువై లారీలు చిక్కుకుపోయాయి. లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు. తొలుత 24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. అయితే క్రమేణా వరద ఉధృతి పెరగడంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్వంలో మిగిలిన వారిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న 53 మందిని కాపాడామని, వర్షా కాలంలో నదుల్లో పనిచేసేముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. -
పెరుగుతూ..తగ్గుతూ..!
హిరమండలం: ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వంశధార నదిలో వరద మంగళవారం రోజంతా పెరుగుతూ.. తగ్గుతూ పరవళ్లు తొక్కింది. గొట్టా బ్యారేజీ వద్ద ఉదయానికి 41,221 క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు. అయితే ఆ తరువాత ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం సయామానికి 36,300 క్యూసెక్కులకు, సాయంత్రానికి 30,740 క్యూసెక్కులకు చేరింది. ఈ నీటిని 22 గేట్ల ద్వారా బయటకు విడిచి పెడుతున్నట్లు ప్రాజెక్టు డీఈ ప్రభాకర్ తెలిపారు. కాగా ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం12 గంటల వరకు 256.26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వంశధారలో వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయాంత్రానికి కుట్రగూడ వద్ద 25.8 మిల్లి మీటర్లు, గుడారి వద్ద 51.6 మి.మీ, మోహన్ వద్ద 26.8 మి.మీ, గుణుపూర్‌లో 61 మి.మీ, మహేంద్రగడ వద్ద 51.6 మి.మీ, కాశీనగర్ వద్ద 36 మి.మీ, గొట్టా వద్ద 36 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. నదీ తీర గ్రామాల్లో అప్రమత్తం వంశధారలో మంగళవారం ఉదయం వరద నీటి ప్రవాహం పెరిగి మొదటి ప్రమాద హెచ్చరికను దాటడంతో నదీ పరివాహక గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టా బ్యారేజీ కార్యాలయానికి వెళ్లి వరదనీటి పరిస్థితి, ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో నమోదైన వర్షపాతం గురించి అడిగి తెలుసుకున్నారు. -
నిలకడగా వంశధార
హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నీటి ప్రవాహం నికడగా ఉంది. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం ఇన్‌ఫ్లో 10490 క్యూసెక్కులు నమోదైంది. బ్యారేజీ వద్ద 37.89 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు డీఈ ప్రభాకరరావు తెలిపారు. 8,805 క్యూసెక్కుల నీటిని దిగువుకు విడిచి పెడుతున్నామన్నారు. ఎడమకాలువకు 299 క్యూసెక్కులు, కుడి కాలువకు 82 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టినట్టు వెల్లడించారు. -
ముప్పు ముంగిట గొట్టా
హిరమండలం: జిల్లా రైతులకు జీవనాధారమైన వంశధార నదిపై నిర్మించిన గొట్టా బ్యారేజీ ముప్పు ముంగిట నిలిచి ఆందోళన కలిగిస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ సిరుల పంటలు పండిస్తున్న బ్యారేజీ ఎగువ భాగాన్ని చూస్తే భవిష్యత్తు ఎంతో భయానకంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా పూడిక పేరుకుపోయి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. బ్యారేజీ నిర్మించి 37 ఏళ్లు పూర్తి అయినా ఇంతవరకు పూడిక తీసిన సందర్భాలు లేవు. ఫలితంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 25 శాతానికి పడిపోయిందని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ గేట్ల వద్ద మట్టి, ఇసుక మేటలు వేయడమే ఈ పరిస్థితికి కారణం. దీని ప్రభావం పంటలకు నీటి సరఫరాపై పడుతోంది. కుడి, ఎడమ కాలువలకు అవసరమైనంత నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. గులుమూరు గ్రామం వద్ద నది గమనం మారడం కూడా నదిలో పూడిక పెరిగిపోయేందుకు ఒక కారణం. ఇలా గత 20 ఏళ్ల నుంచి మట్టి ఎక్కువగా చేరుతోంది. గతంలో ఇక్కడికి వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించాలని వంశధార అధికారులను ఆదేశించినా అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. 30 శాతం నీరే విడుదల వంశధార కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు 872 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 300 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేకపోతున్నారు. బ్యారేజీ నుంచి కుడికాలువకు నీరు విడుదలయ్యే ప్రదేశం వద్ద పూడిక పేరుకుపోవడంతో ప్రవాహ దిశ అనుకున్న విధంగా సాగట్లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో తక్కువ పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగాా శివారు ఆయకట్టుకు నీరందక రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద భారీగా పూడికతో నిండిపోయి నీరు వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో నీటి విడుదల సమయంలో తాత్కాలికంగా కొంత మట్టిని తొలగించారు. బ్యారేజీ 20, 21, 22 గేట్ల పెద్ద మట్టిదిబ్బల స్థాయిలో పూడిక నిండిపోయింది. ఇది కుడికాలువ నీటి ప్రవాహానికి అవాంతరంగా మారింది. మహేంద్రతనయతో ముప్పు వంశధారకు ఉపనదిగా ఉన్న మహేంద్రతనయ నుంచే ఎక్కువగా మట్టి కొట్టుకువస్తోంది. వంశధార ప్రవాహంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా మట్టి వస్తుండడంతో బ్యారేజీ వద్ద లోతు తగ్గి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దశాబ్దాల తరబడి నది ఎగువ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతుల చెబుతున్నారు. గొట్టా నుంచి గులుమూరు వరకు సుమారు 6.2 కి.మీ., తుంగతంపర నుంచి సుమారు 3.5 కి.మీ. మేరకు నదిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలను తొలగించాల్సి ఉందని వంశధార అధికారులు చెబుతున్నారు. కనీసం దమ్ము ట్రాక్టర్లతో నీరు లేని సమయంలో ఈ ప్రాంతంలో దున్నించినా మట్టి మేటలు వదులై భారీ వరదల సమయంలో దిగువకు కొట్టుకుపోయి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు. -
భారీవర్షాలతో నిండుగా జలాశయాలు
-
భారీవర్షాలతో నిండుగా జలాశయాలు
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలలో భారీ స్థాయిలో నీరు చేరింది. శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1.21 లక్షలు, ఔట్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీకాకుళం జిల్లా వంశధార గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 87 వేల క్యూసెక్కులుగా ఉంది. కొత్తూరు మండలం మాతల వద్ద రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మహదేవ్పూర్ మండలంలోని పెద్దంపేట, పంకెన, సర్వాయిపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 16 అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1,069 అడుగులకు చేరింది.ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ** -
శోకసంద్రం
హిరమండలం, గొట్టాబ్యారేజీ వద్ద స్నానానికి దిగి గల్లంతైన విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతదేహాలను శుక్రవారం వెలికి తీశారు. గల్లంతైన విద్యార్థుల కోసం వచ్చిన వారి మృతుల బంధువులు, స్నేహితులతో గొట్టాబ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మృతదేహాలను చూసిన వారి రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గిరిజాల కిశోర్‌కుమార్, గందేసు అప్పలరెడ్డి, బర్రి అజయ్ కుమార్ గురువారం సాయంత్రం హిరమండలం సమీపంలో గల గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలియడంతో వారి మృతదేహాల కోసం పోలీసులు, కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు 30 మంది గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే.... కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే ఇలా అర్దంతరంగా తనువు చాలించారని మృతుల బంధువులు రోదించారు. ముగ్గురూ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కిశోర్ రాజు తండ్రి వెంకటరావు లారీ డ్రైవర్‌గా, అజయ్ కుమార్ తండ్రి గుర్నాథరావు కార్పెంటర్‌గా, అప్పలరెడ్డి తండ్రి ముసలయ్య స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ముసలయ్య, భూలోకమ్మల ఏకైకసంతానం అప్పలరెడ్డి. ఒక్క కుమారుడు వంశధారకు బలవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అజయ్‌కుమార్ తండ్రి గుర్నాథరావు రెండు రోజుల కిందట షిప్‌యార్డులో కూలీగా వెళ్లారు. కన్నకొడుకు మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేకపోయాడని అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన అతని పెదనాన్న బర్రి అప్పలరాజు సంఘటన స్థలంలో బిగ్గరగా రోదిస్తుంటే వారించేందుకు పలువురు ప్రయత్నించారు. కిశోర్‌కుమార్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు వెంకటరావు, ప్రభావతి తట్టుకోలేకపోయారు. హృద్రోగి అయిన ప్రభావతి విలపిస్తూ భావోద్వేగంతో కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను అక్కడి నుంచి బంధువులు దూరంగా తీసుకువెళ్లారు. ఎక్కడో పుట్టి.. ] ఎక్కడో పుట్టి ఇక్కడ తనువు చాలించారని సంఘటన స్థలంలో పలువురు విచారం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు విజయనగరంలో చదువుకుంటూ శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకునేందుకు జలుమూరు మండలం మర్రివలసలోని మిత్రుడు ప్రవీణ్‌కుమార్ ఇంటికి వచ్చారు. ఆలయంలో రద్దీగా ఉందని నది వద్దకు వెళ్లారని, శ్రీముఖలింగేశ్వరుడి సన్నిధిలో ఉంటే మృత్యువాత పడేవారు కారని కొందరు అన్నారు. జనసంద్రమైన గొట్టా బ్యారేజీ ప్రమాదానికి గురైన విద్యార్థుల గురించి తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు తరలి రావడంతో గొట్టాబ్యారేజీ జనసంద్రమైంది. సంఘటన స్థలికి విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని అవంతి సెయింట్ థెరిసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధులు శ్రీధర్, మహేష్ వచ్చారు. మృతదేహాలను చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టారు. మృతదేహాలను పోసుమ్టమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి గొట్టాబ్యారేజి వద్ద హెచ్చరిక బోర్డులు పెద్దవి ఏర్పాటు చేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్న బోర్డులను తొలగించి పెద్ద బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆ బోర్డులపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. సందర్శకులు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు. -
'వంశధార'లో విద్యార్థుల మృతదేహలు లభ్యం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా హిరామండంలం గొట్టాబ్యారేజిలో నిన్న స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులలో ఇద్దరి మృతదేహాలను లభ్యమయ్యాయి. కిశోర రాజు, అజయ్ వెంకట కుమార్ మృతదేహలను శుక్రవారం ఉదయం గుర్తించారు. మరో విద్యార్థి అప్పలరెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. గరివిడి అవంతి సెయింట్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయంలో తీవ్ర రద్దీగా ఉండటంతో సమీపంలోని గొట్టా బ్యారేజ్ చూసొద్దామని వెళ్లారు. అక్కడే ఉన్న వంశధార నదిలో నలుగురు విద్యార్థులు స్నానానికి దిగారు. అందులో ముగ్గురు విద్యార్థులు కిశోర రాజు, అజయ్ వెంకట కుమార్, అప్పలరాజు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నించగా వారు ప్రవాహంలో కొట్టుకుపోయారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు మృతదేహలు లభ్యమైనాయి. -
కాల్వలో మునిగి నలుగురు చిన్నారుల మృతి
శుబలాయి: శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో శుబలాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గొట్ట బ్యారేజ్ వద్ద వంశధార కుడికాల్వలో మునిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. స్నానం చేసేందుకు కాల్వలోకి దిగి వీరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో తరగతి చదువుతున్న ఎ. బాలు, రెండు, ఆరు, ఏడు తరగతి విద్యార్థినులు టి. సవ్రంతి, టి. తులసి, కె. మానస మృతి చెందారు. నీళ్లలో మునిగిన మరో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మరణంతో శుబలాయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.