శోకసంద్రం | died for swimming | Sakshi
Sakshi News home page

శోకసంద్రం

Published Sat, Mar 1 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

శోకసంద్రం

శోకసంద్రం

 హిరమండలం,
 గొట్టాబ్యారేజీ వద్ద స్నానానికి దిగి గల్లంతైన విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతదేహాలను శుక్రవారం వెలికి తీశారు. గల్లంతైన విద్యార్థుల కోసం వచ్చిన వారి మృతుల బంధువులు, స్నేహితులతో గొట్టాబ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మృతదేహాలను చూసిన వారి రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి.
   

 

   విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గిరిజాల కిశోర్‌కుమార్, గందేసు అప్పలరెడ్డి, బర్రి అజయ్ కుమార్ గురువారం సాయంత్రం హిరమండలం సమీపంలో గల గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలియడంతో వారి మృతదేహాల కోసం పోలీసులు, కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు 30 మంది గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికితీశారు.
 కుటుంబానికి ఆసరాగా

 

 ఉంటారనుకుంటే....

 కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే ఇలా అర్దంతరంగా తనువు చాలించారని మృతుల బంధువులు రోదించారు. ముగ్గురూ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కిశోర్ రాజు తండ్రి  వెంకటరావు లారీ డ్రైవర్‌గా,  అజయ్ కుమార్ తండ్రి గుర్నాథరావు కార్పెంటర్‌గా, అప్పలరెడ్డి తండ్రి ముసలయ్య స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ముసలయ్య, భూలోకమ్మల ఏకైకసంతానం అప్పలరెడ్డి. ఒక్క కుమారుడు వంశధారకు బలవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

అజయ్‌కుమార్ తండ్రి గుర్నాథరావు రెండు రోజుల కిందట షిప్‌యార్డులో కూలీగా వెళ్లారు. కన్నకొడుకు మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేకపోయాడని అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన అతని పెదనాన్న బర్రి అప్పలరాజు సంఘటన స్థలంలో బిగ్గరగా రోదిస్తుంటే వారించేందుకు పలువురు ప్రయత్నించారు. కిశోర్‌కుమార్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు వెంకటరావు, ప్రభావతి తట్టుకోలేకపోయారు. హృద్రోగి అయిన ప్రభావతి విలపిస్తూ భావోద్వేగంతో కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను అక్కడి నుంచి బంధువులు దూరంగా తీసుకువెళ్లారు.
 

ఎక్కడో పుట్టి..
]

ఎక్కడో పుట్టి ఇక్కడ తనువు చాలించారని సంఘటన స్థలంలో పలువురు విచారం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు విజయనగరంలో చదువుకుంటూ శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకునేందుకు జలుమూరు మండలం మర్రివలసలోని మిత్రుడు ప్రవీణ్‌కుమార్ ఇంటికి వచ్చారు. ఆలయంలో రద్దీగా ఉందని నది వద్దకు వెళ్లారని, శ్రీముఖలింగేశ్వరుడి సన్నిధిలో ఉంటే మృత్యువాత పడేవారు కారని కొందరు అన్నారు.
 

జనసంద్రమైన గొట్టా బ్యారేజీ    

 ప్రమాదానికి గురైన విద్యార్థుల గురించి తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు తరలి రావడంతో గొట్టాబ్యారేజీ జనసంద్రమైంది. సంఘటన స్థలికి విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని అవంతి సెయింట్ థెరిసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధులు శ్రీధర్, మహేష్ వచ్చారు. మృతదేహాలను చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టారు. మృతదేహాలను పోసుమ్టమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు.  

 

 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

 

 గొట్టాబ్యారేజి వద్ద  హెచ్చరిక బోర్డులు పెద్దవి ఏర్పాటు చేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్న బోర్డులను తొలగించి పెద్ద బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆ బోర్డులపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. సందర్శకులు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.  ఈ సందర్భంగా అధికారులకు తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement