సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘యాభై ఏళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయనోళ్లు ఇప్పుడొచ్చి ఏం చేస్తారు? వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దు’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఓటేసి ఆయన్ని మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో గురువారం పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు.
కేసీఆర్‌ను దించాలనే వాళ్ల దగ్గర జవాబేదీ?
‘కేసీఆర్‌ను దించడమే లక్ష్యమని ఒకరు.. కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని మరొకరు మాట్లాడుతున్నారు. ఎందుకు దించాలో, ఎందుకు జైల్లో పెట్టాలో అడిగితే ఒక్కరి దగ్గరా సమాధానం లేదు. అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నందుకు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నందుకు, నేడు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నందుకు కేసీఆర్‌ను జైల్లో పెట్టాలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. గత 9 ఏళ్ల కాలంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణ యావత్ దేశానికే ధాన్య భాండాగారం అయితే తెలంగాణలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ధాన్య భాండాగారంగా మారిందన్నారు.
పదిసార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు?
‘2014కు ముందు కరెంటు ఉంటే వార్త. నేడు కరెంటు పోతే వార్తలా మారింది. దేశంలో ఎక్కడా లేనట్లుగా రైతుబంధు, రైతుబీమాతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ అదనంగా రూ. 12 వేల కోట్ల భారం ప్రభుత్వం భరిస్తోంది. 50 ఏళ్లు అధికారంలో ఉండి ఫ్లోరైడ్‌ను రూపుమాపలేని కాంగ్రెస్ దద్దమ్మలు నేడు కేసీఆర్ దిగిపోవాలని మాట్లాడుతున్నారు.. చూస్తూ ఊరుకుందామా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
67 ఏళ్ల పాలనలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలను పట్టించుకోలేదని, అలాంటి వారు వచ్చి నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పదిసార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ నేతలు ఏం చేశారని... గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజలంతా ఆలోచించాలన్నారు. ‘కర్ణాటక, గుజరాత్‌ల నుంచి కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు డబ్బులు తెచ్చి ఇస్తారు. తీసుకొని జేబులో పెట్టుకోండి. కానీ ఓటు మాత్రం కిషోర్ కారు గుర్తుకే వేయాలని, సీఎం కేసీఆర్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ పిట్టకథ..
‘ఒక ఊర్లో ఓ 15 ఏళ్ల పిల్లాడు చెడు అలవాట్లకు బానిసై తాగుబోతు, తిరుగుబోతు అయ్యాడు. ఓ రోజు మత్తులో తండ్రి జేబులోంచి డబ్బు కొట్టేస్తుండగా తల్లి చూసి ఇంట్లోనే దొంగతనం చేస్తావా అంటూ కొడుతుంది. మత్తులో ఉన్న పిల్లాడు రోకలిబండతో తల్లిని కొట్టి చంపుతాడు. అది చూసిన తండ్రి పిల్లాడిని కొడితే తండ్రిని కూడా రోకలిబండతో కొట్టి చంపేస్తాడు.
పోలీసులు ఆ బాలుడిని జడ్జి ముందుకు తీసుకెళ్లగా జడ్జి స్పందిస్తూ నేను ఎందరో లుచ్ఛాలను, లంగాలను, చివరకు రేవంత్‌రెడ్డిని కూడా చూశాను. కానీ నీ అంత గలీజ్‌గాడిని చూడలేదు. తల్లిదండ్రులను చంపిన నీకు ఏం శిక్ష వేయాలో అర్థం కావట్లేదు... నువ్వే చెప్పు అని అడగ్గా ఆ పిల్లాడు నేను తల్లిదండ్రులు లేని అనాథను.. నన్ను విడిచిపెట్టండి సార్ అన్నాడంట.. కాంగ్రెసోళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
నిరూపిస్తే క్షమాపణలకు సిద్ధం: మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ జిల్లాలో అభివృద్ధి జరగలేదని నిరూపించగలిగితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన ప్రగతిని నిరూపిస్తే కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి నుంచి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాస్తారా? అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment