ఒక గ్రామం.. రెండు సభలు!
జన్మభూమి గ్రామ సభలు గ్రామానికొకటి చొప్పున జరగాలి.. దానికి సర్పంచ్ నేతృత్వం వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.కానీ కొన్ని గ్రామాల్లో జరుగుతున్న తంతు వేరేగా ఉంది..తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రూపొం దించిన మార్గదర్శకాలనే టీడీపీ నేతలు కాలదన్నుతున్నారు. టీడీపీ సర్పంచులు లేని చోట్ల తమ పెత్తనం నిరూపించుకునేందుకు పోటీ గ్రామ సభలు నిర్వహిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ఏ సభకు వెళ్లాలో తెలియక ఇటు ప్రజలు.. అటు అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. సోమవారం దుగ్గుపురం గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది.
హిరమండలం: హిరమండలం మండలం దుగ్గుపురం గ్రామంలో సోమవారం జన్మభూమి-మా ఊరు గ్రామ సభ జరగాల్సి ఉంది. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఆర్.మోహనరావు ఈ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం పది గంటలకు సభ ప్రారంభమైంది. అయితే అదే సమయంలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప సర్పంచ్ వర్గీయులు దీనికి పోటీగా స్థానిక పాఠశాల వద్ద మరో సభ నిర్వహించారు. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు రెండు సభలకు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఐటీడీఏ పీవో ఆగ్రహం
అదే సమయంలో ఐటీడీపీ పీవో సత్యనారాయణ గ్రామ సభ జరుగుతున్న తీరు పరిశీలించేందుకు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ అధికారులు పెద్దగా కనిపించకపోవడంతో విషయమేమిటని ఆరా తీశారు. పాఠశాల వద్ద నిర్వహిస్తున్న మరో జన్మభూమి సభకు వెళ్లారని సర్పంచ్, స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అలా ఎందుకు జరిగిందని పీవో ప్రశ్నించారు. ఇంతలోనే ఎంపీడీవో కుమారస్వామి అక్కడికి వచ్చారు. గ్రామ సభలో ఉండకుండా ఎక్కడికి వెళ్లారని పీవో ప్రశ్నించగా గ్రామ పరిశీలనకు వెళ్లానని ఆయన సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహం చెందిన పీవో సాయంత్రం వరకు పంచాయతీ కార్యాలయం వద్దే ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించారు. కాగా ఈ పరిస్థితికి అధికారుల వైఖరే కారణమని ఇరుపార్టీల వారు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలోనే గ్రామ సభ జరగాలని, అయితే వేరే చోట సభ ఏర్పాటు చేయాలని తమను అధికారులు కోరడం వల్లే వివాదం ఏర్పడిందని ఉప సర్పంచ్ పి.శ్రీనివాసరావు చెప్పారు. రెండు చోట్ల సమావేశాలు జరగడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు ఇబ్బం దులకు గురయ్యారు. గ్రామస్తులు పార్టీలవారీగా విడిపోయి.. రెండు సభలకు వెళ్లడంతో పార్టీ విభేదాలను రెచ్చగొట్టినట్లు అయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఏ సభకు వెళ్లా లో.. ఎక్కడ భోజనం చేయాలో అర్థం కాక.. చివరికి రెండింటికీ డుమ్మా కొట్టి పస్తులున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం:ఎమ్మెల్యే కలమట
దుగ్గుపురంలో నిబంధనలకు విరుద్ధంగా రెండుచోట్ల జన్మభూమి-మాఊరు సభలు నిర్వహించడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రూపొందిం చిన నిబంధనలను ఆ పార్టీవారే ధిక్కరించడం దారుణమని, బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.