వీసీతో విద్యార్థి సంఘం నేతల వాగ్వాదం
ఎస్కేయూలో ఉద్రిక్తత
యూనివర్సిటీ :
ఎస్కేయూ పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయకపోవడం వివాదాలకు దారితీస్తోంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తయారుచేసిన మినిట్స్‌ను సోమవారం వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ మేరకు వెల్లడించలేదంటూ రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్యను వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం బుధవారం నిలదీసింది. నేరుగా మినిట్స్‌ను ఇవ్వలేమని వీసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.
దీంతో వీసీ ఆచార్య కె.రామకృష్ణారెడ్డిని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.వి.లింగారెడ్డి విద్యార్థులు కలిసి మాట్లాడారు. ఆ సమయంలో తీవ్ర మాటల యుద్ధం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పాలక మండలి నిర్ణయాలను బహిర్గతం చేయాలని కోరితే సమస్యను పక్కదారి పట్టించడానికి వాగ్వాదానికి దిగుతున్నారని విద్యార్ధి నేతలు ధ్వజమెత్తారు. వీసీ పదవీకాలం ఆరునెలల ముందు ఏ విధమైన నియామకాలు చేపట్టకూడదంటూ 203 జీవోను అడ్డం పెట్టి ప్రస్తుతం దొడ్డిదారిన ఎలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు.
అక్రమంగా కల్పించిన పదోన్నతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుకూలమైన వ్యక్తుల కోసం పాలకమండలిని మభ్యపెట్టి వారికి ప్రయోజనాలను కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదునెలలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నేరుగా సీటు వర్క్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
వీసీ హోదాను మరిచారు : రాజ్యాంగబద్దమైన ఉన్నత హోదాలో ఉన్న వీసీ ఆచార్య కె.రామకృష్ణారెడ్డి తన హోదాను మరిచి విద్యార్థులపై దౌర్జన్యానికి దిగడం సముచితంగా లేదని ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం పేర్కొంది. హుందాగా వ్యవహరించి, సమన్యాయం పాటించాల్సిన కీలకమైన పదవిలో ఉంటూ ఇలా ప్రవర్తించడం బాధాకరంగా ఉందని అన్నారు.
వర్సిటీ యంత్రాంగం అవలంబిస్తున్న ఒంటెత్తుపోకడలను ఇక ముందు కూడా అడ్డుకొంటామని జి.వి.లింగారెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్ధి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు గెలివి నారాయణ రెడ్డి, లాలెప్ప, క్రాంతికిరణ్, మోహనరెడ్డి, గోవిందు, అశోక్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.