ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ వసతి గృహాల్లో విద్యార్థులకు గదులు కేటాయింపు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు గదులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు వివిధ రూపాల్లో రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించడంలేదని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వీసీ రామకృష్ణారెడ్డిని విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఆ సమయంలో సోమవారం లోపు ప్రతి ఒక్క విద్యార్థికి వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదని విద్యార్థులు తెలి పారు. సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ ఫణీశ్వరరాజు, వార్డన్ రంగస్వామి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జయరాజ్‌లు మహానంది వసతి గృహానికి చేరుకొని గదులులేని విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్నారు.
అనంతరం ప్రతి గదికి వెళ్లిన ముగ్గురున్న చోట ఒకరికి చోటు కల్పించేందుకు సమాయత్తమయ్యారు. అయితే విద్యార్థులు మాత్రం కోర్సుల వారీగా గదులు కేటాయించాలని, లేనిపక్షంలో తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో రిజిస్ట్రార్ గోవిందప్ప హాస్టల్‌కు రావడంతో గదులు కేటాయించేందుకు ఎన్ని రోజులు కావాలంటూ ఆయనను నిలదీశారు. వసతిగృహాల విద్యార్థుల బాగోగులు చూడలేని అధికారులు పదవులకు రాజీనామాలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో వార్డన్ రంగస్వామి పదవికి రాజీనామా చేసినట్లు పేపర్‌పై సంతకం చేసి రిజిస్ట్రార్‌కు ఇవ్వగా ఆయన తిరస్కరించారు. నాన్‌బోర్డర్లను అధికారులే ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. గదులు లేనివారికి ఇప్పుడే కేటాయించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. రాత్రి వరకూ ఆందోళన కొనసాగింది.
అధికారులతో విద్యార్థుల వాగ్వాదం
Published Tue, Nov 19 2013 3:49 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement