చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
హిందూపురం: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఎలాంటి ఒత్తిళ్లకూ తావుండదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎవరైనా అలాచేస్తే ముఖ్యమంత్రి, తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. పోలీసులను మభ్యపెట్టి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసు పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
హిందూపురం నియోజకవర్గం చౌళూరులో ఇటీవల హత్యకు గురైన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. తనకు, తన కుమారుడు మిథున్‌రెడ్డికి వ్యక్తిగతంగా కూడా కావాల్సిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని చెప్పారు. రామకృష్ణారెడ్డిని కోల్పోవడం పార్టీకి నష్టమని చెప్పారు.
దోషులు ఎవరైనా వదిలేది లేదని, అందుకు తాను హామీ అని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment