Argumentation
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం
కోడేరు (కొల్లాపూర్): టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగిన సంఘటన మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తల్లి, భార్య గ్రామానికి వచ్చారు. టీఆర్ఎస్ నాయకులు వారిని చూసి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి వచ్చారా అని వాగ్వాదానికి దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరుపార్టీల వారిని చెదరగొట్టారు. ఎమ్మెల్యే తల్లి బిచ్చమ్మ, భార్యను అక్కడి నుంచి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. -
సుప్రీంకోర్టులో ఈసీ, కాంగ్రెస్ వాగ్వాదం!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలపై సుప్రీంకోర్టు సాక్షిగా కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ వాగ్వాదానికి దిగాయి. ఓటర్ల జాబితాలో నకిలీఓట్ల అంశంపై దాఖలైన కేసులను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల సుప్రీంకోర్టు బెంచ్ సోమవారం విచారణ ముగించి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, సచిన్ పైలట్లు కేసు వేయగా వీరి తరఫున కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదించారు. ఈ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ని ప్రతివాదిగా చేర్చగా, ఈసీ తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నాటి కొన్ని వీవీప్యాట్లను చెక్‌చేయాలని సిబల్ వాదించారు. అయితే, ఓటర్ల జాబితాలో నకిలీఓట్లు ఉన్నా యని అసత్య ఆరోపణలు చేస్తూ, ఈసీలాంటి రాజ్యాంగబద్ధ సంస్థను అపఖ్యాతిపాలు చేయాలని కాంగ్రెస్ నేతలు కుట్రపన్నారని వికాస్ సింగ్ వాదించారు. అయితే, ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 60 లక్షల నకిలీఓట్లు బయటపడ్డాయని, మరో 24 లక్షల ఓట్లను ఈసీనే తొలగించిందని సిబల్ వాదించారు. -
అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాల మధ్య కొట్లాట
న్యూఢిల్లీ: బెంగాల్ రంజీ ఆటగాళ్లు అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాలు తీవ్రస్థారుులో వాగ్వాదంతో పాటు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. తమిళనాడుతో జరిగే రంజీ గ్రూప్ లీగ్ మ్యాచ్ కోసం బెంగాల్ ఆటగాళ్లు తమ నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ‘నిజానికి ఇందులో ఓజా తప్పేమీ లేదు. అతడు చాలా నెమ్మదస్తుడు. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు దిండా చాలా గట్టిగా బంతిని కిక్ చేశాడు. అది నేరుగా ఓజా చెవుల పక్కనుంచే వెళ్లింది. కొద్దిలో అయితే గాయపడేవాడు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిండాపై అరిచాడు. తను దగ్గరికి రావడంతో ఓజా వెనక్కి నెట్టేశాడు. దీంతో కిందపడిన దిండా తిరిగి ఓజా పైకి రాగా ఇతర ఆటగాళ్లు ఇద్దరినీ విడదీశారు’ అని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్‌కు ఆడిన ఓజాను ఉద్దేశించి ‘అవుట్ సైడర్’ అని దిండా ఎగతాళి చేసినట్టు సమాచారం. అలాగే కెప్టెన్ మనోజ్ తివారి, కోచ్ సాయిరాజ్ బహుతులే, మేనేజర్ ఆటగాళ్లిద్దరితో మాట్లాడి మరోసారి ఇలాంటి చేష్టలకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఇలాంటివి మంచిది కాదని సూచించారు. గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవకు దిగిన సంఘటనలున్నారుు. -
వీసీతో విద్యార్థి సంఘం నేతల వాగ్వాదం
ఎస్కేయూలో ఉద్రిక్తత యూనివర్సిటీ : ఎస్కేయూ పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయకపోవడం వివాదాలకు దారితీస్తోంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తయారుచేసిన మినిట్స్‌ను సోమవారం వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ మేరకు వెల్లడించలేదంటూ రిజిస్ట్రార్ ఆచార్య కె.దశరథరామయ్యను వైఎస్ఆర్ విద్యార్థి విభాగం బుధవారం నిలదీసింది. నేరుగా మినిట్స్‌ను ఇవ్వలేమని వీసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో వీసీ ఆచార్య కె.రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.వి.లింగారెడ్డి విద్యార్థులు కలిసి మాట్లాడారు. ఆ సమయంలో తీవ్ర మాటల యుద్ధం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పాలక మండలి నిర్ణయాలను బహిర్గతం చేయాలని కోరితే సమస్యను పక్కదారి పట్టించడానికి వాగ్వాదానికి దిగుతున్నారని విద్యార్ధి నేతలు ధ్వజమెత్తారు. వీసీ పదవీకాలం ఆరునెలల ముందు ఏ విధమైన నియామకాలు చేపట్టకూడదంటూ 203 జీవోను అడ్డం పెట్టి ప్రస్తుతం దొడ్డిదారిన ఎలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు. అక్రమంగా కల్పించిన పదోన్నతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుకూలమైన వ్యక్తుల కోసం పాలకమండలిని మభ్యపెట్టి వారికి ప్రయోజనాలను కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదునెలలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నేరుగా సీటు వర్క్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వీసీ హోదాను మరిచారు : రాజ్యాంగబద్దమైన ఉన్నత హోదాలో ఉన్న వీసీ ఆచార్య కె.రామకృష్ణారెడ్డి తన హోదాను మరిచి విద్యార్థులపై దౌర్జన్యానికి దిగడం సముచితంగా లేదని ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం పేర్కొంది. హుందాగా వ్యవహరించి, సమన్యాయం పాటించాల్సిన కీలకమైన పదవిలో ఉంటూ ఇలా ప్రవర్తించడం బాధాకరంగా ఉందని అన్నారు. వర్సిటీ యంత్రాంగం అవలంబిస్తున్న ఒంటెత్తుపోకడలను ఇక ముందు కూడా అడ్డుకొంటామని జి.వి.లింగారెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్ధి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు గెలివి నారాయణ రెడ్డి, లాలెప్ప, క్రాంతికిరణ్, మోహనరెడ్డి, గోవిందు, అశోక్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అధికారులతో విద్యార్థుల వాగ్వాదం
ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ వసతి గృహాల్లో విద్యార్థులకు గదులు కేటాయింపు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు గదులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు వివిధ రూపాల్లో రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించడంలేదని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వీసీ రామకృష్ణారెడ్డిని విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఆ సమయంలో సోమవారం లోపు ప్రతి ఒక్క విద్యార్థికి వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదని విద్యార్థులు తెలి పారు. సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ ఫణీశ్వరరాజు, వార్డన్ రంగస్వామి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జయరాజ్‌లు మహానంది వసతి గృహానికి చేరుకొని గదులులేని విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రతి గదికి వెళ్లిన ముగ్గురున్న చోట ఒకరికి చోటు కల్పించేందుకు సమాయత్తమయ్యారు. అయితే విద్యార్థులు మాత్రం కోర్సుల వారీగా గదులు కేటాయించాలని, లేనిపక్షంలో తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో రిజిస్ట్రార్ గోవిందప్ప హాస్టల్‌కు రావడంతో గదులు కేటాయించేందుకు ఎన్ని రోజులు కావాలంటూ ఆయనను నిలదీశారు. వసతిగృహాల విద్యార్థుల బాగోగులు చూడలేని అధికారులు పదవులకు రాజీనామాలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో వార్డన్ రంగస్వామి పదవికి రాజీనామా చేసినట్లు పేపర్‌పై సంతకం చేసి రిజిస్ట్రార్‌కు ఇవ్వగా ఆయన తిరస్కరించారు. నాన్బోర్డర్లను అధికారులే ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. గదులు లేనివారికి ఇప్పుడే కేటాయించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. రాత్రి వరకూ ఆందోళన కొనసాగింది.