అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాల మధ్య కొట్లాట
న్యూఢిల్లీ: బెంగాల్ రంజీ ఆటగాళ్లు అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాలు తీవ్రస్థారుులో వాగ్వాదంతో పాటు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. తమిళనాడుతో జరిగే రంజీ గ్రూప్ లీగ్ మ్యాచ్ కోసం బెంగాల్ ఆటగాళ్లు తమ నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ‘నిజానికి ఇందులో ఓజా తప్పేమీ లేదు. అతడు చాలా నెమ్మదస్తుడు. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు దిండా చాలా గట్టిగా బంతిని కిక్ చేశాడు. అది నేరుగా ఓజా చెవుల పక్కనుంచే వెళ్లింది. కొద్దిలో అయితే గాయపడేవాడు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిండాపై అరిచాడు. తను దగ్గరికి రావడంతో ఓజా వెనక్కి నెట్టేశాడు.
దీంతో కిందపడిన దిండా తిరిగి ఓజా పైకి రాగా ఇతర ఆటగాళ్లు ఇద్దరినీ విడదీశారు’ అని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్‌కు ఆడిన ఓజాను ఉద్దేశించి ‘అవుట్ సైడర్’ అని దిండా ఎగతాళి చేసినట్టు సమాచారం. అలాగే కెప్టెన్ మనోజ్ తివారి, కోచ్ సాయిరాజ్ బహుతులే, మేనేజర్ ఆటగాళ్లిద్దరితో మాట్లాడి మరోసారి ఇలాంటి చేష్టలకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఇలాంటివి మంచిది కాదని సూచించారు. గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవకు దిగిన సంఘటనలున్నారుు.