రైస్ మిల్లును తనిఖీ చేస్తున్న విజిలెన్స్ ఎస్పీ గంగాధరరావు తదితరులు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు గురువారం జిల్లాలోని సీఎంఆర్ అనుమతి ఉన్న రైస్‌మిల్లులను తనిఖీలు చేశారు. రావులపాలెం మండలం ఈతకోటలోని శ్రీ వెంకట పద్మ ట్రేడర్స్‌ను విజిలెన్స్ ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు. రికార్డులు, స్టాకు నిల్వలను పరిశీలించారు. ఎ –బీ రిజిష్టర్లలో స్టాకు వ్యత్యాసాలు ఉన్నట్టు ఆయన గుర్తించారు. మొత్తం 2,229 క్వింటాళ్ల ధాన్యం అధికంగా ఉన్నట్టు గుర్తించిన ఆయన .. తగిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఏఎస్‌ఓకు సూచించారు. ఈ మిల్లుకు ధాన్యం సరఫరా చేసిన ముమ్మిడివరప్పాడు, ఈతకోట, పలివెల, రావుల పాలెం పీపీసీ కేంద్రాలను అధికారులు తనిఖీలు చేసి రైతుల వివరాలు సేకరించారు. అనపర్తి మండలం పెడపర్తి, సోమేశ్వరం, పులగుర్త, పెనికేరు, పొలమూరు, చింతలూరు, మురమండ గ్రామాల్లోని మిల్లులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ పి.ముత్యాల నాయుడు, అధికారులు వై.సత్యకిషోర్, టి.రామ్మోహన్ రెడ్డి, బి.సాయి రమేష్, ఎస్.రామకృష్ణ, ఏఎస్‌ఓ జె.ఆనంద్‌బాబు, ఎంఎస్‌ఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment