సొంత మండలంలోనే పోస్టింగ్‌ | Village and Ward Secretaries Job Postings within own zone | Sakshi
Sakshi News home page

సొంత మండలంలోనే పోస్టింగ్‌

Published Mon, Sep 30 2019 4:28 AM | Last Updated on Mon, Sep 30 2019 2:37 PM

Village and Ward Secretaries Job Postings within own zone - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్‌ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్‌ ఇస్తారు. ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు పోస్టింగ్‌ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్సీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు అన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్‌ ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు. 

ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు 
గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీన(సోమవారం) జిల్లా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేస్తారు. విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేస్తారు. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అంటే అభ్యర్థి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు  నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని, సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్‌ ఆర్డర్‌లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. 

సీఎం కార్యక్రమ షెడ్యూల్‌ 
విజయవాడలోని ‘ఎ’ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికై, కార్యక్రమానికి ఆహ్వానం ఆందినవారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగులకు లాంఛనప్రాయంగా నియామక పత్రాలు అందజేసిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఇలా ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు వీలుగా అధికారులు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement