సింగారానికి ‘వల’
Published Tue, Jan 28 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :నడిగూడెం మండలం సింగారం గ్రామ పరిధిలోని చెరువులో చేపల పెంపకానికి అనుమతి తీసుకునేందుకు కొందరు వల పన్నారు. వారి ప్రయత్నం ఫలిస్తే రెండు మంచినీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది. కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గం పరిధిలోని 27గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయినా కొందరు నేతలు చేపల పెంపకానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింగారం చెరువు ప్రతిఏటా సాగర్ నీటితో కళకళలాడుతోంది. దీనిని మంచినీటి కోసం ఉపయోగించుకోవడానికి జిల్లా అధికారులు ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 2009లో *14 కోట్లతో నాబార్డు సహకారంతో చెరువుకు సమీపంలో మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని ద్వారా కోదాడ నియోజకవర్గం పరిధిలోని 27 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
కోదాడ పట్టణానికి నీరందించేందుకు..
సింగారం చెరువు ద్వారా కోదాడ పట్టణానికి మంచినీటిని
అందించేందుకు 2011లో *9 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. దీని కోసం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని రామిరెడ్డిపాలెం వద్ద ఫిల్టర్‌బెడ్లను కూడా నిర్మించారు. దీని పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే వేసవిలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోగానే ఈ చెరువులో చేపల పెంపకానికి అనుమతి తీసుకొచ్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువును రిజర్వాయర్‌గా మార్చక ముందు దీనిలో గ్రామానికి చెందిన మత్స్య సహకార సొసైటీ ఆధ్వర్యంలో చేపల పెంపకం చేపట్టేవారు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి భారీగానే దండుకునేవారు.
పైరవీల జోరు.. కలెక్టర్‌పై ఒత్తిడి
చేపల ఆదాయంపై కన్నేసిన రాజకీయ నాయకులు మత్య్సకారుల ఉపాధిని సాకుగా చూపి చేపల పెంపకానికి అనుమతి పొందేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు కొందరు కలెక్టర్‌ను కూడా కలిశారు. అయితే నిబంధనల ప్రకారం ఓ కలెక్టర్ నిషేధించిన దానిని తాను మళ్లీ అనుమతి ఇవ్వలేనని ప్రస్తుత కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయనపై రాజధాని స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
తెప్పలు, చిన్న వలలతో నష్టం లేదు
చెరువులో మత్య్సకారులు తెప్పలపై, చిన్న వలలను ఉపయోగించి చేపలు పట్టుకోవడం వల్ల పెద్ద ఇబ్బం ది ఉండదు. ప్రతిరోజూ ఇలాగే చేపలు పట్టుకుంటే ఎవరికీ నష్టముండదు. కానీ, సొసైటీ వారు చేపల పెంపకాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. వారే చేప పిల్లలను పోసి, ఫీడ్ వేసి, చేపలు పట్టుకుంటారు. వాటి బరువును బట్టి కిలోకి ఇంత అని సొసైటీకి డబ్బు చెల్లిస్తారు. ఈ డబ్బును సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులు పంచుకుంటారు. వీరిలో కొద్దిమందికి మాత్రమే చేపలు పటేట్టప్పుడు కాంట్రాక్టర్ పని కల్పిస్తాడు. ఈ విధంగా కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల ఫీడ్ వేసేందుకు, చేపలు పట్టడానికి పెద్ద వలలు వాడడంతో చెరువు నీరు కలుషితం అవుతుందని అధికారులంటున్నారు. తెప్పలపై గ్రామానికిచెందిన మత్స్య కారులే చేపలు పట్టుకుంటే అభ్యంతరం చెప్పేవారు ఉండరని, వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అధికారులే పేర్కొంటున్నారు. అలా కాకుండా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తేనే ఇబ్బందులుఎదురవుతాయన్నారు.
Advertisement
Advertisement