నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని గొప్ప పేరు పొందింది విశాఖ నగరం.. కానీ నగరానికి, జిల్లాకు పరిపాలనా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయం మాత్రం అప్పుల కుప్పలా మారిపోయింది.గత ఐదేళ్లలో అయిన దానికీ.. కానిదానికీ విశాఖను వేదికగా చేసుకొని హంగూ ఆర్భాటాలతో హడావుడి చేసిన టీడీపీ సర్కారు వాటి నిర్వహణకు అయిన ఖర్చులను మాత్రం విదల్చలేదు. ఉత్తుత్తి కేటాయింపులు, హామీలే తప్ప నిధుల విడదల ఊసు లేకపోవడంతో ఆ హంగూ ఆర్భాటాలకు అయిన ఖర్చుల భారం కలెక్టరేట్ నెత్తిన పడింది. బహిరంగ సభలు, సదస్సులు, ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన నిర్వాహక ఏజెన్సీలకు కోట్లలోనే బకాయి పడింది. అదిగో.. అలాంటి బకాయిలే జీవీఎంసీకి కలెక్టరేట్, సర్క్యూట్‌హౌస్‌ల తరఫున చెల్లించాల్సిన రూ.6కోట్లు. సర్కారు తరఫున నిర్వహించిన పలు కార్యక్రమాలకు షామియానాలు సరఫరా చేసిన వారికే అక్షరాల ఆరు కోట్ల రూపాయలు బకాయిపడ్డారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, విశాఖపట్నం: నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ జిలాŠల్ కలెక్టరేట్ అప్పుల్లో కూరుకుపోయింది. కలెక్టరేట్ అప్పుల్లో ఉండడం ఏమిటనుకుంటున్నారా?.. కానీ ఇది పచ్చి నిజం. గడిచిన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉత్సవాలు, సంబరాలు, సదస్సులు, సమ్మేళనాల పేరిట చేసిన హంగు, ఆర్భాటాలకు చేసిన అప్పులు ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ మెడకు చుట్టుకున్నాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ కలెక్టరేట్‌కు అక్షరాలా రూ.21.50 కోట్ల అప్పు ఉంది. వీటితో పాటు జీవీఎంసీకి కలెక్టరేట్ అప్పు పడింది రూ.5.19 కోట్లు. కలెక్టరేట్‌కు చెందిన సర్క్యూట్ హౌస్‌కు సంబంధించి మరో రూ.78.40 లక్షలున్నాయి. ఇలా ఇవన్నీ కలుపుకొంటే దాదాపు రూ.27.50 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విశాఖకు వారానికోసారి వస్తూ పోతుండేవారు. రాష్ట్ర చరిత్రలో మరే ఇతర ముఖ్యమంత్రి రానన్ని సార్లు విశాఖకు ఆయన వచ్చారు. అధికారికంగా 115 సార్లు విశాఖ జిల్లాలో పర్యటించారు. గ్రామీణ జిల్లాలోకంటే విశాఖ నగరంలోనే ఎక్కువ సార్లు పర్యటించారు. 2014 నుంచి ఆయన పర్యటనలకు చెల్లించాల్సిన రెగ్యులర్ ప్రోటోకాల్ నిధులే రూ.ఏడున్నర కోట్ల వరకు ఉన్నాయి. ఇక సదస్సులు, సమ్మేళనాల పేరిట ఇతర పర్యటనలకు సంబంధించి షామియానాలకే ఏకంగా రూ.6 కోట్లకు పైగా కలెక్టరేట్ చెల్లించాల్సి ఉంది. ఇక పట్టాల పండగ పేరిట మూడేళ్ల పాటు వరుసగా సిటీలో భారీ సభలు ఏర్పాటు చేశారు. 60 వేల మందికి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కోసం ఏయూ, స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభల కోసం రూ.8.50కోట్లు పైగా ఖర్చు చేశారు.
మిగిలిన బకాయిలెలా ఉన్నా.. పట్టాల పండగల పేరిట ఖర్చు చేసిన రూ.8.50 కోట్ల బకాయిల కోసం గడిచిన ఏడాదిలో రెండు మూడు సార్లు లేఖలు రాసినా జీఏడీ ససేమిరా అంది. మా అనుమతి లేకుండా మీ ఇష్టమొచ్చినట్టుగా హంగూ ఆర్భాటంగా ఖర్చుచేస్తే మేమెందుకు ఇస్తామంటూ జీఏడీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆ సొమ్ములను ఏ విధంగా రాబట్టాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో వైపు ఈ అప్పులోళ్లు రోజూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని వడ్డీలు చెల్లించలేకపోతున్నామంటూ షామియానాలు అద్దెకు ఇచ్చిన టెంట్ హౌస్ యజమానులు, వాహనాలు సమకూర్చిన ట్రావెల్ ఏజెంట్లు, ఇలా ప్రతి ఒక్కరూ బకాయిల కోసం ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ బకాయిల కోసం మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment