హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న
ఇళ్లు లక్షకుపైనే..
ప్రభుత్వం మంజూరుచేసింది పదివేలు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంకా ప్రారంభంకాని ఇళ్ల నిర్మాణం విజయనగరం క్రైం: గత ఏడాది ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుద్‌హుద్ తుపాను ధాటికి బాధితులు నష్టపోయింది కొండంత అయితే ప్రభుత్వం మంజూరు చేసింది గోరంత చందంగా ఉంది బాధితుల పరిస్థితి. గత ఏడాది అక్టోబర్ 12న ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుద్‌హుద్ తుపాను ప్రజలను తీవ్రమైన భయాందోళనలకు గురిచేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుద్‌హుద్ విలయతాండవం చేయడంతో పేదల ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది. మూడు జిల్లాల్లో ఇళ్లు కోల్పోయిన అనేకమంది ఉండడానికి గూడు లేక ప్రభుత్వం తమకు ఇళ్లు ఇస్తుందేమో ఆన్న ఆశతో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు, అయితే విజయనగరం జిల్లాలో 15,212 ఇళ్లు, విశాఖపట్నం జిల్లాలో సుమారు 60వేల ఇళ్లు, శ్రీకాకుళం జిల్లాలో 30వేల ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించినప్పటికీ ఈ మూడు జిల్లాలకు ప్రభుత్వం మం జూరు చేసిన ఇళ్లు కేవలం పదివేలు మాత్రమే. లక్షల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు వేలల్లో ఇళ్లు మంజూరు చేయడం పట్ల బాధితులు ఆందోళన చెందుతున్నారు.
నిర్మాణానికి చర్యలేవీ..?
తుపాను వచ్చి సుమారు తొమ్మిదినెలలు కావస్తోంది. బాధితులను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించారు. కానీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో శ్రద్ధ చూపడం లేదని బాధితులు వాపోతున్నారు. తుపాను బాధితులకు ఈఏడాది అక్టోబర్ 12 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి విశాఖపట్నం జిల్లాలో 2500 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. విజయనగరం జిల్లాలో మం జూరైన 15 వందల ఇళ్లలో 500 ఇళ్లకు మాత్రమే టెండర్లు వేశారు. మిగతా ఇళ్ల నిర్మాణానికి టెండర్లు వేయాల్సి ఉంది. ఈఏడాది అక్టోబర్ 12నాటికి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే..
ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా..!
Published Wed, Jul 8 2015 12:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement