కర్నూలు(అగ్రికల్చర్) : గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యానికి స్వచ్ఛంద సంస్థలు తగిన చొరవ తీసుకోవాలని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. శుక్రవారం సమావేశ మందిరంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యపరంగా గ్రామాలు అభివృద్ధి చెందడంలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలన్నారు.
ప్రతి స్వచ్ఛంద సంస్థ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రభుత్వ సహకారంతో సంపూర్ణ పారిశుద్ధ్యానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 50 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, ఒక్కొక్కటి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన తెచ్చి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేయాలని కోరారు. చిత్తశుద్ధితో పనిచేసిన సంస్థలకు సహకారం ఉంటుందని వివరించారు. జిల్లాలో 6.44 లక్షల కుటుంబాలను సర్వే చేయగా కేవలం 2 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయని, ఇంకా 4.44 లక్షల కుటుంబాలకు లేవని తెలిపారు.
ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రూ.12 వేలు ఇస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. భూగర్భ జలాలను అభివృద్ధి చేసే విధంగా ఫారంపాండ్, చెక్ డ్యామ్‌లు, నీటి కుంటలు నిర్మించుకునేలా చూడాలన్నారు. మార్చి 31లోపు అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ మరుగుదొడ్డి ఉండే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీవో ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జయచంద్రబాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా చొరవ తీసుకోవాలి
Published Sat, Jan 10 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement