న్యూఢిల్లీ: అత్యాచారాలు సహా మహిళలపై అనేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న 48 మంది ప్రస్తుతం దేశంలోని వివిధ చట్టసభల్లో దర్జాగా సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచే 12 మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే ప్రమాణ పత్రాల్లోని కేసులను విశ్లేషించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎన్నికల సంస్కరణల కోసం శ్రమిస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ మొత్తం 4,845 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన మీదట ఓ నివేదికను తయారుచేసింది.
నేరాలకు పాల్పడి చట్టసభల్లో కూర్చుంటున్న ఈ 48 మందిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, మిగిలిన 45 మంది వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 12 మంది, పశ్చిమ బెంగాల్‌లో 11 మంది, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో చెరో 5 మందితో కలిపి 48లో మొత్తం 33 మంది ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. పార్టీల వారీగా అయితే ఈ 48 మందిలో బీజేపీకి చెందినవారు 12 మంది, శివసేన పార్టీ వారు ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు కలిపి ఈ మూడు పార్టీల నుంచే 25 మంది ఉన్నారు.
తీవ్ర నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో నిర్ణీత సమయంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నేరం రుజువైతే వారి సభ్యత్వాలను రద్దుచేయడం తదితర సంస్కరణలను ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. అన్ని పార్టీలూ నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నాయనీ, గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 327 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment