![Waheed Hassan Couple Came Madanapalle - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/29/sfsa.jpg.webp?itok=9KSWwGwY)
తల్లిదండ్రులు, భర్తతో ఫిదా
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ హసన్, ఆయన భార్య ఇలహం దంపతులు ఆదివారం భారత్‌కు వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉంటున్న కుమార్తె ఫిదా, అల్లుడు కొప్పల జనార్దన్‌రెడ్డి, మనవడు గోపాల్‌రెడ్డిలను చూడటానికి వారు సముద్రాలు దాటి వచ్చారు. అల్లుడు జనార్దన్‌రెడ్డి పెదతల్లి దేవనమ్మ మదనపల్లెలో మదర్ మీరా పేరిట ఆశ్రమ పాఠశాల నెలకొల్పారు. ఆ పనులపై ఆమె తరచూ జర్మనీ వెళ్లి వస్తుండేవారు. ఒక సందర్భంలో ఆమె సుమారు పదేళ్లపాటు అక్కడి ఆశ్రమంలో ఉండాల్సి వచ్చింది. ఆశ్రమ పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జనార్దనరెడ్డి పెదతల్లిని చూడటానికి 2015లో జర్మనీ వెళ్లారు. అదే సమయంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ హసన్ భార్య ఇలహం జర్మనీ ఆశ్రమంలోనే ఉన్నారు.
ఆమెను చూడటానికి కుమార్తె ఫిదా మాల్దీవుల నుంచి వచ్చింది. ఒకే సమయంలో తల్లిని చూడటానికి వెళ్లిన ఫిదా, పెద తల్లిని చూడటానికి వెళ్లిన జనార్దన్‌రెడ్డి ప్రేమలో పడ్డారు. ఆ తరువాత జనార్దన్‌రెడ్డి స్వదేశానికి వచ్చేశారు. జనార్దన్‌ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న ఫిదా.. తల్లిదండ్రులను ఒప్పించింది. 2016లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ సమీపంలోని కాండ్లమడుగు క్రాస్‌లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇరువర్గాల తల్లిదండ్రులు జనార్దన్, ఫిదాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. అప్పటినుంచి జనార్దన్, ఫిదా దంపతులు మదనపల్లెలోనే నివాసం ఉంటున్నారు.
ఆ దంపతులకు ఏడాదిన్నర క్రితం కుమారుడు గోపాల్‌రెడ్డి జన్మించగా, ఫిదా ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మహమ్మద్ వహీద్ హసన్, ఇలహం ఆదివారం మదనపల్లెకు వచ్చారు. అల్లుడు, కుమార్తె, మనవడితోపాటు వారి బంధువులను కలుసుకున్నారు. సోమవారం కూడా వీరు ఇక్కడే ఉంటారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మదనపల్లెకు వస్తున్నారని తెలిసి.. జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్, డీఎస్పీ చిదానందరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రూరల్ ఎస్‌ఐ దిలీప్‌కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment