రుణమాఫీ పేరుతో దొంగ సంతకాలు!
- ఆక్వా ఫ్యాక్టరీ సిబ్బంది ఘనకార్యం
- కనిపెట్టిన గ్రామస్తులు
- పారిపోయిన దళారులు
- గుడిదిబ్బలో ఉద్రిక్తత
కృత్తివెన్ను : డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలంటే గ్రామస్తులంతా సంతకాలు చేయాలని చెబుతూ తిరుగుతున్న కొంతమంది దళారుల మోసకారి వ్యవహారం బట్టబయలు కావడంతో వారంతా పరార యిన ఘటన కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుడిదిబ్బలో ఆక్వా పరిశ్రమకు సంబంధించిన ఓ ఫ్యాక్టరీని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.
అయితే దీని వల్ల గ్రామస్తుల ఆరోగ్యంతో పాటు మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని రెండు నెలల క్రితం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారులు నిలిపివేశారు. అయితే ఎలాగైనా ఆ ఫ్యాక్టరీ పనులు పునఃప్రారంభించాలనే దురుద్దేశంతో కొంతమంది గ్రామస్తులతో కలసి ఫ్యాక్టరీ సిబ్బంది బుధవారం రాత్రి రుణమాఫీ పేరుతో దొంగ సంతకాలు తీసుకోవడం మొదలుపెట్టారు.
అయితే ఈ సంతకాల విషయంలో అనుమానం వచ్చిన కొంతమంది గ్రామస్తులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కోపోద్రిక్తులయిన సుమారు 400 మంది గ్రామస్తులు సంతకాలు సేకరిస్తున్న సిబ్బందిపై దాడిచేయడానికి సిద్ధమయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది, దళారులు బలమున్నంత వరకు కాలికి బుద్ధిచెప్పారు.
అనంతరం గ్రామస్తులంతా ఒకచోట సమావేశమై ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఆత్మహత్యలు చేసుకోవడానికీ వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రజల మాన ప్రాణాలతో చెలగాట మాడే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎరవేసే ఎంగిలి మెతుకులకు అలవాటుపడిన కొంత మంది స్వార్థపరుల వల్లనే వ్యవస్థ నాశన మవుతుందని ధ్వజమెత్తారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్‌ఐ కె. సత్యనారాయణ తన సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తేవడానికి నానా తంటాలు పడ్డారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ఫ్యాక్టరీల నిర్మాణానికి సహకరించే దళారులను, ఫ్యాక్టరీ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై మరోసారి ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఆమరణ నిరాహారదీక్షలకూ వెనుకాడబోమంటూ హెచ్చరించారు. చివరకు పెద్దల సహకారంతో ఎస్‌ఐ పరిస్థితిని చక్కదిద్దారు.