డోకి హరీష్ మృతికి నిరసనగా ఆందోళన చేపట్టిన పలాస నియోజకవర్గ ప్రజలు(ఫైల్‌ఫొటో)
అన్యాయం జరిగింది.. తమకు న్యాయం చేయండి మహాప్రభో అని వేడుకుంటే తిరిగి బాధితులనే భయభ్రాంతులకు గురిచేస్తారు. ఇంకా ప్రశ్నిస్తే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తారు. నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి మౌనం వహించడం, షాడో నేత అంతా తానై వ్యవహరించి అవినీతిపరులకు, అక్రమార్కులకు కొమ్ముకాయడం పరిపాటిగా మారింది. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు గోడపత్రికల రూపంలో ఆవేదన వెల్లగక్కుతున్నారు.
సాక్షి, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరాయి. ఏ మూలచూసినా.. ఏ నోట విన్నా ‘వెంకన్న’ లీలలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే శివాజీ మౌనం వహించడంతో సదరు షాడో నేత పరిపాలనకు కేంద్ర బిందువుగా మారారు. ఏ పని జరగాలన్నా ఆయన ఆమోదం ఉండాల్సిందే. ఎదిరిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టించడం, జైలుకు పంపించడం, అధికారులతో దాడులు జరి పించడం వంటి కార్యకలాపాలకు పాల్పడతారని భయపడి కొందరు ఎక్కడికక్కడ ‘గోడపత్రికలు’ విడుదల చేసి తమ గోడు వినిపిస్తున్నారు.
నువ్వలరేవులో వాల్‌పోస్టర్ల కలకలం..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామంటూ జన్మభూమి కమిటీలు, టీడీపీ నాయకులు ప్రజల నుంచి వేల రూపాయల్లో కమీషన్లు దండుకుంటున్నారు. ప్రధానంగా నువ్వలరేవులో ఎంపీటీసీ సభ్యుడు, మరో ఎంపీటీసీ ప్రతినిధి, జన్మభూమి కమిటీ సభ్యుడు కలిసి సంక్షేమ పథకాల మంజూరు పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ వాటాలలో కొంత ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కుపల్లి, మెట్టూరు గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.
మరుగుదొడ్డి కావాలంటే రూ.1800, ఇంటి కోసం రూ.15వేలు–రూ.20 వేలు, చంద్రన్న బీమా అందించాలంటే రూ.20,000, పింఛన్ కావాలంటే రూ.1500 నుంచి రూ.3000.. ఇలా ఒక్కో పథకానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ‘పెద్ద’ల అండదండలు ఉండటం వల్లే ఇలా దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి ఆగడాలను భరించలేక నువ్వలరేవులో కొందరు గోడ పత్రికను విడుదల చేసి నాయకులు బండారాన్ని బయటపెట్టారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదంటూ ప్రజలు మండిపడుతున్నారు.
బెదిరింపుల పర్వం..
పలాస ఎమ్మెల్యే అల్లుడు, రెండేళ్ల క్రితం పనిచేసిన కాశీబుగ్గ పోలీసు అధికారి, కొంతమంది సొంపేట పోలీసుల వల్ల తనకు ప్రాణభయం ఉందని, ఏం జరిగినా ఎమ్మెల్యే అల్లుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని పలాసకు చెందిన ఓ వైశ్య కుటుంబం పేరిట విడుదలైన గోడపత్రికలు అప్పట్లో కలకలం రేపాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే శివాజీ అల్లుడిపై విడుదలైన కరపత్రాలను సైతం ఇప్పటికీ మరవలేక పోతున్నారు.
వైశ్యుల్లో ఆగ్రహావేశాలు..
బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన వైశ్య యువకుడు డోకి హరీష్ కాశీబుగ్గ ఓ మిఠాయి దుకాణంలో బతుకు తెరువుకోసం కూలిపనిచేసే వాడు. ఇతడిపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ దాడి చేసి మరణానికి కారకుడయ్యాడు. ఈ ఉదంతాన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ ముక్తకంఠంతో ఖండించారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్పీల వరకు విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జంట పట్టణాలను స్తంభింపజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేయించిన ఎమ్మెల్యే.. తిరిగి నెలరోజుల్లోనే బయటకు తీసుకువచ్చి ప్రస్తుతం ప్రచారంలో వెంటవేసుకుని తిరుగుతున్నారు.
ఎలా మర్చిపోగలం..
తాజా ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు జంట పట్టణాల పరిధిలోని వైశ్య కుటుంబాలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వైశ్యులపై జరిగిన దాడులను గుర్తు చేసుకుని కొందరు సమావేశం మధ్యలోనే వెనక్కువచ్చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment