అధికార పార్టీలో అంతర్యుద్ధం
► చిచ్చురేపిన సంస్థాగత ఎన్నికలు
► గందరగోళంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
► డుమ్మా కొట్టిన ఎంపీ గల్లా జయదేవ్
► రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని టీడీపీ నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధం గుంటూరు పార్లమెంట్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా బహిర్గతమైంది. గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మండల, డివిజన్ స్థాయి నాయకులు సమన్వయకమిటీ సమావేశానికి హాజరై పార్లమెంట్ ఇన్‌చార్జి, మంత్రి అయ్యన్నపాత్రుడుకు వినతి పత్రం ఇచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి డివిజన్ అధ్యక్షులను నియమించారు.
పార్టీకి సంబంధం లేని వ్యక్తులను డివిజన్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే మోదుగుల నియమించారంటూ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ వర్గీయులు గొడవకు దిగారు. దీనిపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాలంటూ పట్టుబట్టారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మోదుగుల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల, డివిజన్ స్థాయి అధ్యక్షులను అక్కడి ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తున్నారని, అలా కానట్లయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులను ఎవరు నియమిస్తారో చెప్పాలంటూ అడగడంతో అయ్యన్నపాత్రుడుతో సహా జిల్లా నేతలంతా మిన్నకున్నట్లు సమాచారం.
ప్రత్తిపాడుకు ఇన్‌చార్జిని నియమించాలి....
ఇక ప్రత్తిపాడు నియోజకవర్గ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మంత్రి పదవి కోల్పోయి తీవ్ర అసంతృప్తితో ఉన్న రావెల కిషోర్‌బాబు ఇటీవల గుంటూరు నగరంలో సీఎం పర్యటనలో సైతం పాల్గొనని విషయం తెలిసిందే. ఆయన బుధవారం రాత్రి జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఆయన వ్యతిరేక వర్గం నేతలు అన్ని మండలాల నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని ప్రత్తిపాడులో పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
మాజీ మంత్రి రావెల పార్టీని గాలికొదిలేశారని, ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా పార్టీ ఇన్‌చార్జిని నియమించాలంటూ పార్లమెంటు ఇన్‌చార్జి అయ్యన్నపాత్రుడిని కోరారు. మరోవైపు ఎమ్మెల్యేల వర్గీయులు సైతం ప్రత్యారోపణలకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నేతలను పార్టీ కార్యాలయం నుంచి పంపి వేసిన తరువాత సమన్వయ కమిటీ సమావేశాన్ని కొనసాగించారు.
గుంటూరు ఎంపీ గైర్హాజరు..
మొదటి సమావేశానికే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గైర్హాజరవడం పట్ల పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సమయంలో సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబే ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని క్లాస్ తీసుకున్నా ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
పార్టీని పటిష్ట పరిచేందుకే ఇన్‌చార్జుల నియామకం
నగరంపాలెం(గుంటూరు): పార్లమెంట్ పరిధిలో పార్టీని పటిష్టపరచటానికే అధిష్టానం ఇన్‌చార్జులను నియమించినట్లు గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం రాత్రి టీడీపీ జిల్లా కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ çసమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
నియోజకవర్గాల్లో నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. నామినేటెడ్ పదవులకు పేర్లు ప్రతిపాదించే సమయంలో జిల్లా స్థాయిలోనే కసరత్తు జరిపి ఒకరిద్దరి పేర్లు మాత్రమే సూచించాలన్నారు. ఎక్కువ మంది పేర్లు అందించటం వలన అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా ఉంటోందన్నారు.