బాపట్ల తెలుగుదేశం పార్టీలో ఐక్యత కొరవడింది. వర్గపోరుతో అట్టుడికిపోతోంది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి చోటా తమ్ముళ్ల తగవులాటే కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలనే కార్యకర్తలు చింపేయడం... ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగడం... అధిష్టానానికి మింగుడుపడటం లేదు.
చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం... వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ముకాయడం... బాపట్ల ఇన్‌చార్జి రోజుకో నాయకుడ్ని వెనకేసుకు రావడం... అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు. రేపల్లె... అద్దంకిలో ఇంటిపోరు తీవ్రరూపం దాల్చడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల వేళ పచ్చపార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే మరొకరికి గిట్టక వెన్నుపోట్లకు సిద్ధపడుతున్నారు. ఆధిపత్యపోరుతో అమీతువీుకి సిద్ధపడుతున్నారు. రేపల్లెలో సొంత పార్టీనేతనే ఏకంగా హత్య చేసిన ఘటన జరగ్గా మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు ముదిరి ఘర్షణలకు దిగిన ఘటనలు కోకొల్లలు.
‘ఏలూరి’ తీరుపై కేడర్ విసుగు
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసిగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంతపార్టీ ఫ్లెక్సీలనే చింపేసి, ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. పోపూరి శ్రీనివాసరావు, ద్రోణాల దరశి, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావాలని ఈయన తిరుపతి వరకూ వెనక్కు నడిచారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
కొండయ్యా... ఏందయ్యా ఇది?
చీరాల టీడీపీ ఇన్‌చార్జ్ ఎం.ఎం.కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని చంద్రబాబు, లోకేశ్‌లకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, చీరాలకు చెందిన డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కొండయ్యను వ్యతిరేకిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు తమ వర్గానికి కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని యాదవ సామాజికవర్గం తేల్చి చెబుతోంది.
‘నక్కా’నూ... పక్కన పెట్టేస్తారా?
వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వేమూరు మండల టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలున్నాయి. కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ మైనేని మురళి, మధుసూదనరావుకు, అమృతలూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ జెడ్పీటీసీ చరణ్‌గిరి, భట్టిప్రోలులో మాజీ ఎంపీపీ తూనుగుంట్ల సాయిబాబు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరణ శ్రీనివాసరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ మండలాలన్నింట్లో ఓ వర్గానికి ఆనందబాబు కొమ్ముకాయడంతో రెండో వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది.
‘వేగేశన’తో వేగలేం !
బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన హయాంలో పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తానికొండ దయాబాబును తొలగించి వడ్లమూడి వెంకటేశ్వరరావును నియమించడం, తర్వాత ఆయన్నూ తొలగించి గోలపల శ్రీనివాసరావును నియమించడం, సతీష్ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కావూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి ముక్కాముల శివను నియమించడంపై కేడర్ గుర్రుగా ఉంది.
వీరే గాకుండా బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కాముల శివ, గొలపల శ్రీను, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కర్లపాలెం మండలంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ గుంపులకన్నయ్య, మైనారిటీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మహ్మద్ హజీజుల్లాబేగ్, పార్టీ అధ్యక్షుడు వసంతారెడ్డితో కూడిన ఒక వర్గం వర్మను వ్యతిరేకిస్తోంది. కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నక్కల వెంకటస్వామిని తొలగించి ఏపూరి భూపతిరావును నియమించడం, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోకరాజు శ్రీధర్‌వర్మ స్థానంలో కనుమూరి సాంబమూర్తిరాజును నియమించడం, కొన్నాళ్ళ తర్వాత మహ్మద్ అబ్జల్‌ను నియమించడంతో అక్కడ అసంతృప్తి నెలకొంది.
‘అన్నే’ మరణం.. ‘అనగాని’కి శరాఘాతం..
రేపల్లె పట్టణానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణను సొంత పార్టీలోని పరిటాల యువసేన నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌పై వ్యతిరేకత చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టం కానుంది.
ఈ సారి ‘గొట్టిపాటి’కి గట్టిదెబ్బే..
అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొందరికే ప్రాధాన్యమిస్తుండటం,ప్రధానంగా సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి తదితర మండలాల్లో విభేదాలు అధికంగా ఉన్నాయి. సంతమాగులూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగబోతు రామాంజనేయులు, కొరిశపాడు మాజీ జెడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య మరికొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార వైఎస్సార్ సీపీలో చేరారు.
ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరం, అద్దంకి మండలం మోదేపల్లి, జె.పంగులూరు మండలాల పరిధిలో వందలాది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment