మేదరమెట్ల వద్ద సిద్ధం సభా ప్రాంగణానికి సమీపాన జాతీయరహదారిపై నిలిచిపోయిన అశేష జనసందోహంలో ఓ భాగం
సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్‌సీపీ సునామీ
మేదరమెట్ల సభకు దక్షిణ కోస్తాలో 44 నియోజకవర్గాల నుంచి పోటెత్తిన జనప్రవాహం
ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయిన వందలాది ఎకరాల సభా ప్రాంగణం
వాహనాలతో కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
మేదరమెట్ల – రేణంగివరం ఆరు వరుసల రహదారిపై 18 కి.మీ. పొడవునా ఆగిన వాహనాలు
మరో చారిత్రక విజయాన్ని చేకూర్చేందుకు సిద్ధమంటూ నినదించిన లక్షలాది గళాలు
సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సభ
భీమిలి, దెందులూరు, రాప్తాడుకు మించి నాలుగో సభ విజయవంతం కావడంపై శ్రేణుల్లో జోష్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: దక్షిణ కోస్తా ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ కుంభమేళాను తలపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ సునామీకి తాజా సభ మరో తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మేదరమెట్ల–రేణంగివరం మధ్య కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సిద్ధం సభకు ఉదయం 9.30 గంటల నుంచే కార్యకర్తలు, నేతలు, అభిమానుల ప్రవాహం మొదలైంది.
మధ్యాహ్నం 2.45 గంటలకు సభా ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత సభకు వస్తున్న వారంతా జాతీయ రహదారిపై(అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి వీలుగా పది లేన్లతో నాలుగు కి.మీ.పొడవున అభివృద్ధి చేశారు) నిలబడిపోయారు. సభకు తరలివస్తున్న లక్షలాది మంది ప్రజలు వాహనాల్లోనే ఉండిపోయారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేదరమెట్ల–రేణంగివరం మధ్య 18 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారిపై వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మేదరమెట్ల నుంచి అద్దంకి వైపు వెళ్లే నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఏడు కి.మీ. పొడవున వాహనాలు స్తంభించిపోయాయి. సీఎం జగన్ ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా సభకు జనప్రవాహం కొనసాగడం గమనార్హం.
శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహం..
బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తడంతో పార్టీ శ్రేణుల్లో సరి కొత్త ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్రలో జనవరి 27న నిర్వహించిన భీమిలి సభ, ఉత్తర కోస్తాలో ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ, రాయలసీమలో ఫిబ్రవరి 18న నిర్వహించిన రాప్తాడు సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వాటికి మించి మేదరమెట్ల సభ సూపర్ హిట్ కావడం సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల సన్నాహక సభలు ఈ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతలు వణికిపోతున్నారు.
మారుమోగిన ‘సిద్ధం’..
రాష్ట్రంలో 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు చంద్రబాబు–పవన్ కళ్యాణ్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2014 ఎన్నికల్లోనూ ఆ మూడు పార్టీలు జట్టు కట్టాయని గుర్తుచేస్తూ రుణమాఫీ పేరుతో రైతులకు, మహిళలకు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను చంద్రబాబు వంచించిన వైనాన్ని ప్రస్తావించారు.
ఇప్పుడు అదే కూటమి మరోసారి జత కట్టిందని, చంద్రబాబు హామీలకు శకుని చేతిలో పాచికలకు తేడా లేదంటూ విమర్శించడంతో జనం హర్షధ్వానాలు చేశారు. మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశామని, డీబీటీతో రూ.2.65 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని.. పేదలు బాగుపడటం చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని సీఎం జగన్ విమర్శించినప్పుడు జనం నుంచి అనుహ్య స్పందన లభించింది. మరో చారిత్రక విజయానికి, మహా సంగ్రామానికి సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించగా లక్షలాది మంది పిడికిళ్లు బిగించి సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
రైతన్నల రాజ్యం..
సీఎం జగన్ అన్నదాతల శ్రేయస్సును కాంక్షిస్తూ రైతు రాజ్యం తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అందచేశారు. ప్రతి కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేసి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఉద్యోగాలు, పదవులు, రుణాలు, ఇళ్ల స్థలాలు... అన్నింటా వారికే ప్రాధాన్యం ఇచ్చారు. పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు చేరువ చేసి విద్యా దీపాలు వెలిగించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తేదీనే టంచన్‌గా రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లను ఇంటివద్దే పారదర్శకంగా అందించే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. లక్షల సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలతోపాటు గ్రూపు 1, గ్రూపు 2, డీఎస్సీతో యువత కలలను నెరవేరుస్తున్నారు. సీఎం జగన్‌ను ప్రతి పేద కుటుంబం తమ పెద్ద బిడ్డ మాదిరిగానే భావిస్తూ ఆశీర్వదిస్తోంది.
– చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రీజినల్ కో–ఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త.
సముద్రంలో కలిపేస్తాం..
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు సీఎం జగనైతే 14 ఏళ్లు అందరినీ వంచించిన మోసగాడు చంద్రబాబు. మొనగాడు కావాలో.. మోసగాడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సీఎం జగన్‌ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనంటున్న చంద్రబాబు తనకు దత్తపుత్రుడు తోడైనా ధైర్యం చాలక ఇప్పుడు ముగ్గురం కలిసే వస్తామంటున్నారు. ఆయన సింగిల్‌గా వస్తే చితకబాదుతాం. ఇద్దరొస్తే విసిరి కొడతాం. ముగ్గురూ కలిసి వస్తే సముద్రంలో కలిపేస్తాం. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని 50 శాతానికిపైగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఆయన్ను ఏమీ చేయలేరు. టీడీపీ – జనసేన జెండాలు ఎత్తేసే సభలు నిర్వహిస్తున్నాయి. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి
వంచన చరిత్ర బాబుదే
సీఎం జగన్‌కు పాలన చేతకాదని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు నాలుక మడత పెట్టి ఆయన ఒక బటన్ నొక్కితే నేను ఐదు బటన్లు నొక్కుతానని నమ్మబలుకుతున్నారు. కరోనా సమయంలో బడికి వెళ్లని పిల్లలకు ఎవరి అబ్బ సొమ్ములా అమ్మ ఒడి ఇచ్చారని విమర్శించిన చంద్రబాబు తాను ఒక్కరికైతే రూ.15 వేలు, ముగ్గురు పిల్లలుంటే రూ.90 వేలు చొప్పున ఇస్తామంటున్నారు. ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలనూ రుణమాఫీ పేరుతో వంచించిన చరిత్ర చంద్రబాబుదే. సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మాటకు మించి పెట్టుబడి సాయాన్ని అన్నదాతలకు అందచేశారు. మాట ప్రకారం పొదుపు సంఘాల మహిళలను కూడా ఆదుకున్నారు. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
పేద బిడ్డలకు ప్రోత్సాహం..
సీఎం జగన్ నిరుపేద బిడ్డలకు ఇంగ్లిషు మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నారు. చేయూతతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నిజమైన సాధికారత అంటే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే. మహిళల రక్షణ కోసం ‘దిశ’ తీసుకొచ్చారు. 1.40 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ రిజిస్టర్ కావడం సీఎం జగన్ కల్పిస్తున్న భరోసాకు నిదర్శనం.
– మేకతోటి సుచరిత, హోంశాఖ మాజీ మంత్రి
నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ‘సిద్ధం’
బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని ముందుకు సాగటానికి సీఎం జగన్ కల్పిస్తున్న భరోసానే కారణం. ప్రతి కార్యకర్త, నాయకుడు 45 రోజులు పాటు కష్టపడితే ఆ తరువాత ఐదేళ్లు సీఎం జగన్ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. 2024 తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ మాత్రమే ఉంటుంది. జగనన్నను ఎదుర్కొనే దమ్ములేక ఇద్దరు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి కాళ్లా వేళ్లా పడుతున్నారు. – అనిల్‌కుమార్ యాదవ్, నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త
ఊరూరా ఘన స్వాగతం..
నన్ను అద్దంకి పంపించి ఇంత పెద్ద వైఎస్సార్ కుటుంబాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటికి చేరిన సంక్షేమ పథకాలు సీఎం జగన్ మంచితనం, మానవత్వాన్ని చాటుతున్నాయి. 70 ఏళ్ల పెద్దమ్మ కూడా జగనన్నా అంటోందంటే వారి మనసుల్లో సీఎం జగన్ చిరస్థాయిలో నిలిచారనేందుకు నిదర్శనం. – పాణెం హనిమిరెడ్డి, అద్దంకి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
ఒక నమ్మకం.. భరోసా
జగనన్న అంటే.. ఒక నమ్మకం.. ఒక భరోసా. పేదలకు అండగా ఉంటూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేయూతనందిస్తున్నారు. దాదాపు 36 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో నేరుగా రూ.2.50 లక్షల కోట్లకు పైగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశారు. పిల్లల చదువులు మొదలుకొని మహిళలు సాధికారతతో ఎదిగేలా తోడుగా నిలుస్తున్నారు. పేదలకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యం. వీటిని భరోసాగా వారికి అందించిన ఘనత సీఎం జగన్‌దే.
– నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు
నా కుటుంబానికి అన్ని పథకాలు అందాయి.
సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నా కుటుంబానికి అందాయి. నా భార్యకు వైఎస్సార్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ అందాయి. నాకు సెంట్రింగ్ పని నిమిత్తం పెట్టుకున్న రుణం రూ.3లక్షలు కూడా అందజేసిన మనసున్న వ్యక్తి సీఎం జగనన్న. తిరిగి జగనన్నను సీఎంను చేసుకునేందుకు పాటుపడతాం. – షేక్ మీరావలి, సంతనూతలపాడు
జగనన్నను చూడాలన్న కోరికతో వచ్చా
సీఎం జగన్ ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేకపోయారు. అందుకే జగనన్న అంటే ఎనలేని అభిమానం. ఆయన సభ ఎక్కడ జరిగినా, ఎంత దూరమయినా వెళుతుంటాను. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆయన మళ్లీ సీఎం అవడం ఖాయం. – సీహెచ్ రామ్మూర్తి, విశాఖపట్నం
3 చక్రాల బండిపై 80 కి.మీ. ప్రయాణించి వచ్చా..
మాది బాపట్ల పట్టణం ఇందిరానగర్ కాలనీ. దివ్యాంగులం అయిన మాకు జగనన్న సీఎం అయిన తర్వాత చేసిన మేలు జీవితంలో మరువలేం. మాకు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు. జగనన్న మీద అభిమానంతో 80 కిలోమీటర్లు మూడు చక్రాల బండిమీద ప్రయాణం చేస్తూ వచ్చాను. అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి జగనన్న పాలనలోనే పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయి. జగనన్న మాకు చేస్తున్న మేలును మేము జీవితంలో మరువలేం. – చల్లా రామయ్య, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఆరోగ్యం బాగోలేదు.. అయినా నా మనవడిని చూద్దామని వచ్చా..
నాది జె.పంగులూరు మండలం రేణంగివరం గ్రామం. నా వయస్సు 73 ఏళ్లు. నాకు మూడు రోజులుగా జ్వరం. ఒళ్లంతా నొప్పులు. నా మనవడిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. మా ఊరి దగ్గరకు వచ్చినప్పుడైనా చూద్దామనుకుంటే జ్వరం వచ్చింది. అయినా సరే చచ్చినా ఫర్లేదు అనుకుని బయల్దేరాను. అందరూ ముసలిదానివి ఆ జనంలో తొక్కుతారు. చచ్చిపోతావని చెప్పారు. అయినా సంతోషమే అంటూ వచ్చాను. దేవుడి దయవల్ల నన్ను పోలీసులు స్టేజీ దగ్గరకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. నేను నా మనుమడిని దగ్గరగా చూశాను. ఈ జన్మకు ఇది చాలు. – భూమి రాములమ్మ
370 కి.మీ. ప్రయాణించి వచ్చా..
నాది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా. నేను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. విద్యా వ్యవస్థలో జగనన్న తీసుకుంటున్న సమూలమైన మార్పుల కారణంగా జగనన్నకు అభిమానిగా మారాను. ఇంత అభిమానం ఉన్న నాకు జగనన్నకు ఓటేసే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అబ్బాయిని వివాహం చేసుకుని జగనన్నకు ఓటు వేసి ఆయనకు మద్దతుగా నిలవాలన్నది నా కోరిక. ఆయన మీద అభిమానంతో 370 కి.మీ ప్రయాణం చేసి అద్దంకి సిద్ధం సభకు వచ్చా. జగనన్నను దగ్గరగా చూడటంతో నా జన్మ ధన్యమైంది. – తోకాటి నిదూష – కరీంనగర్
దివ్యాంగుడిని అయినా దిగులు లేదు
దివ్యాంగుడిని అయినా నా జీవనంపై దిగులు పడకుండా ప్రభుత్వం నెల నెలా రూ.మూడు వేల పింఛన్ నగదు అందజేసి నాలో మనోధైర్యం నింపుతోంది. త్రిచక్ర వాహనాన్ని కూడా అందజేశారు. అలాగే నా కుటుంబంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమం ప్రతి ఒక్కరికీ అందాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలి. – ఆర్.ఆంజనేయులు, ఒంగోలు
బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌తోనే..
మాది ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం చింతగుంట్ల గ్రామం. మా అభిమాన హీరో, మా ఇంటి ఆశాదీపం అయిన మా జగనన్నను చూసేందుకు బైక్‌పై 100 కి.మీ.ప్రయాణించి వచ్చాం. మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ జగనన్నతోనే ఉంటాం. సీఎం హోదాలో ఉన్న జగనన్న కామన్ మేన్‌గా నడుచుకుంటూ మా మధ్యలోకి రావడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. – రాంబాబు, నాగరాజు, అశోక్
నా రెండు కాళ్లూ సహకరించకున్నా జగన్ కోసం వచ్చా..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు వచ్చాను. నా రెండు కాళ్లు సహకరించకపోయినా మార్కాపురం నుంచి వచ్చాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు మా కుటుంబానికి అందాయి. పంటల బీమా, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటితో మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు జగన్. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం
తెలంగాణ నుంచి వచ్చా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మా ఇంట్లో వెలుగులు నింపాయి. బతుకుదెరువు కోసం నేను బేల్దారి మే్రస్తిగా తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో పనిచేస్తున్నాను. నా కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలు మాకు అందాయి. సీఎం జగన్ మా ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి హన్మకొండ నుంచి ఆయనను చూసేందుకు సిద్ధం సభకు వచ్చాను. – గంగుల అశోక్, మర్రిపూడి
నా మనవడిని దగ్గరగా చూడాలన్న ఆశ నెరవేరింది..
జీవిత చరమాంకంలో ఉన్న మాలాంటి వృద్ధులకు అండగా నిలిచిన నా మనవడు జగన్‌ను దగ్గరగా చూడాలని సిద్ధం సభకు వచ్చాను. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ అందించి మాలాంటి వారికి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నా. నా మనవడిని దగ్గరగా చూడాలనే ఆశ నెరవేరింది. – చెన్నక్క, పొదిలి
జగన్ నూరేళ్లూ చల్లగా ఉండాలి
రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా సీఎం జగన్ నిలిచారు. మా ఇంట్లో రైతు భరోసా వచ్చింది. ఇల్లు కూడా కట్టుకున్నాం. మంచి మనసున్న సీఎం జగన్‌ను చూసేందుకు వృద్ధాప్యంలో ఉన్నా, భార్యాభర్తలం ఇద్దరం వచ్చాం. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలన్నది మా కోరిక. – అనంత సీతమ్మ, జె.పంగులూరు
Comments
Please login to add a commentAdd a comment