సాక్షి, తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి.. వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గణేష్‌ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారన్నారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. 175కి 175 సాధించడమే లక్ష్యమని మోపిదేవి అన్నారు.
ఈవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలంతా గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిది. కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్‌ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్‌లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
‘‘టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్‌కు మూడో సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు. సత్యప్రసాద్ హైదరాబాద్‌లో కూర్చుని పేకాట ఆడుకుంటాడు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్‌ను గెలిపించుకోవాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
అసెంబ్లీ, లోక్‌సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి సీఎం జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారు. అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబులాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు, మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. వైఎస్సార్‌సీపీ అలా చేయదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం.సీఎం జగన్‌ని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment