బాపట్ల జిల్లా అద్దేపల్లిలో పేట్రేగిన టీడీపీ నాయకులు
పెట్రోల్ పోసి వైఎస్సార్ విగ్రహానికి నిప్పు
తమ జెండా స్థూపం పగులగొట్టారంటూ టీడీపీ రివర్స్ ఫిర్యాదు
ఇరువర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు
దళితవాడలో ఉద్రిక్తత.. పోలీస్ పికెట్ ఏర్పాటు
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా గ్రామాల్లో, ఎస్సీ, ఎస్టీ వాడల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలదోస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా చితకబాదుతుండటం ఊరూరా కనిపిస్తోంది. శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలను తొలగిస్తున్నారు.. పగలగొడుతున్నారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదేం కక్ష సాధింపు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎవరైనా ఇలా చేశారా? అధికారం చేజిక్కించుకుంటే ఇలా దాడులు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి లైసెన్స్ వచ్చినట్లా? లేక అధికారంతోపాటు హిస్టీరియా ఏమైనా వచ్చిందా?
రెడ్ బుక్.. రెడ్ బుక్.. అంటూ లోకేశ్‌కు వచి్చన పూనకం తాలూకు ఉన్మాదమే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకూ నరనరాన ఎక్కినట్లుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడమే మీ ఉన్మాద లక్ష్యం అయితే.. ప్రజాగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసి పడటం ఖాయం. ఆ సెగలో మాడి మసి అవుతారో.. లేక పద్ధతి మార్చుకుని బుద్ధిగా పాలన సాగిస్తారో చూడాలి.
అద్దేపల్లి (భట్టిప్రోలు)/సాక్షి ప్రతినిధి బాపట్ల: టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. భట్టిప్రోలు పంచాయతీ పరిధి అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
విగ్రహం ముప్పావు భాగానికి పైగా దగ్ధమైంది. దీంతో దళితవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే, వైఎస్సార్ విగ్రహానికి సమీపంలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైఎస్సార్‌సీపీ వారు పగులగొట్టారని, అందుకు ప్రతీకారంగా వైఎస్ విగ్రహాన్ని తగులబెట్టినట్లు టీడీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు జెండా దిమ్మెను కొద్దిగా పగులగొట్టుకుని ఆ సాకుతో వైఎస్ విగ్రహాన్ని కాల్చివేశారని వైఎస్సార్‌సీపీ నేతలు వాదిస్తున్నారు.
ఇరువర్గాలూ పరస్పర ఫిర్యాదులు
బాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు అనంతరం టీడీపీ అరాచకపర్వం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో చాలామంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదలి వెళ్లిపోయారు.
ఈ పరిస్థితిలో టీడీపీ జెండా దిమ్మెలను పగులగొట్టే పరిస్థితి వైఎస్సార్‌సీపీ నేతలకు లేదన్నది టీడీపీ నేతలకూ తెలుసు. కాకపోతే ఏదో ఒక సాకుచూపి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఏడు మందిపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ప్రతిగా 14 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాలపై కేసులు : ఎస్‌ఐ
ఈ ఘటన గురించి తెలుసుకున్న వేమూరు సీఐ పి.రామకృష్ణ, ఎస్‌ఐ కాసుల శ్రీనివాసరావు, సిబ్బందితో çఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వైఎస్సార్ విగ్రహం దగ్ధం చేసిన ఏడుగురిపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులపై 435, 427, 507 ఆర్/34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. దళితవాడలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు.
విగ్రహాలు ధ్వంసం హేయం : మేరుగు
స్ఫూర్తిని నింపిన మహనీయుల విగ్రహాల ధ్వంసం, దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీమంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విగ్రహం దహనం విషయం తెలుసుకున్న ఆయన అద్దేపల్లిని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. టీడీపీ దురాగతాన్ని ఖండించారు.
హుటాహుటిన మరొక విగ్రహం ఏర్పాటుకు యత్నం
వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు.
దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా పోలీసులు నిర్ధాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారు. విగ్రహాన్ని దగ్ధం చేయడం గ్రామ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని.. చంద్రబాబు రాక్షస పాలనకు ఇది పరాకాష్టని అశోక్‌బాబు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment