అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు
కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వలస నేతలే దిక్కయ్యారు. ఎవరూ దొరకని పరిస్థితుల్లో వారికే సీట్లు కట్టబెడుతున్నారు. ఎంపీ స్థానాల్లో చాలావరకు బయట నుంచి వచ్చిన వారిపైనే ఆధారపడ్డారు. 8 అసెంబ్లీ స్థానాలనూ వలస నేతలకే కేటాయించారు. ఇప్పటివరకు ప్రకటించిన 13 ఎంపీ స్థానాల్లో నాలుగింటిని వలస నేతలకే ఇచ్చారు.
నరసరావుపేట ఎంపీ సీటును ఇటీవలే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన లావు శ్రీకృష్ణదేవరాయులకు కేటాయించారు. నెల్లూరు ఎంపీ స్థానాన్ని మరో ఫిరాయింపు నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చారు. నంద్యాల ఎంపీ సీటుకు అభ్యర్థి లేకపోవడంతో రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, బీజేపీ నేత బైరెడ్డి శబరిని పార్టీలో చేర్చుకుని సీటు ఇచ్చారు.
అసెంబ్లీ స్థానాల్లోనూ వలస నేతలే
పలు అసెంబ్లీ స్థానాలను చంద్రబాబు వలస నేతలకు కట్టబెట్టారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్, కోనేటి ఆదిమూలం, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణలకు సీట్లు కట్టబెట్టారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి టీడీపీ కండువా కప్పుకోకముందే సీటు ప్రకటించారు.
అభ్యర్థులే దొరకని దుస్థితి
మూడు నెలల క్రితం వరకు టీడీపీకి అనేక చోట్ల అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడింది. 50కిపైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇన్‌ఛార్జిలు లేరు. గతంలో పోటీ చేసిన నేతలు మొఖం చాటేయడంతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో దిక్కులేక ఫిరాయింపు నేతలను చేర్చుకుని సీట్లు ఇచ్చారు. ఇంకా ప్రకటించాల్సి ఉన్న ఆరు ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థుల కొరత ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి స్థానానికి పోటీ చేసే అభ్యర్థి కోసం ఇంకా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.
బాపట్లకు తెలంగాణ దిగుమతి నేత
బాపట్ల ఎంపీ సీటును ఏకంగా రాష్ట్రంతో సంబంధం లేని తెలంగాణ బీజేపీ నేత తెన్నేటి కృష్ణప్రసాద్‌కు ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులను చంద్రబాబు నివ్వెరపరిచారు. తద్వారా ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు బయట పార్టీలపై ఎంత ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చు. కనీసం పార్టీలో చేరకుండానే కృష్ణప్రసాద్‌కి సీటు కేటాయించారు. సీటు ప్రకటించి వారం రోజులైనా ఇంతవరకు ఆయన టీడీపీలో చేరకపోవడం విశేషం.
ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సిన నాలుగు ఎంపీ సీట్లలోనూ వలస నాయకులనే నిలబెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించిన మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఇప్పటికే టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు ఆయనకు ఒంగోలు స్థానాన్ని దాదాపు ఖరారు చేశారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి బెయిల్‌పై ఉన్నందున శ్రీనివాసులరెడ్డికి సీటు ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment