విన్నారు... చూశారు | Was heard ... | Sakshi
Sakshi News home page

విన్నారు... చూశారు

Published Mon, May 26 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

Was heard ...

జమ్మలమడుగు,న్యూస్‌లైన్:
 జిల్లాలో ఉక్కు పరిశ్రమను  ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను సెయిల్ ప్రతినిధుల బృందం ఆదివారం క్షేత్రస్థాయిలో  పరిశీలించింది.   సెయిల్ కంపెనీకి చెందిన  ఆర్.కె.సిన్హా, ఏ.మైత్రి, బి.సర్కార్, కుమార్, ఎస్.సింగ్, సావర్ని, బెనర్జీ, సాహులతో కూడిన బృందం   మైలవరం మండలం లింగాపురం సమీపంలోని  ఎం.కంబాల దిన్నె వద్ద ఉన్న  భూములతో పాటు బ్రహ్మణిని కూడా  పరిశీలించారు.
 
  బ్రహ్మణికి  కేటాయించిన భూముల వివరాలతో పాటు స్టీల్‌ప్లాంట్  నిర్మాణం కోసం యాజమాన్యం ఎంత ఖర్చు చేసిందో వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైలవరం మండలంలోని కంబాలదిన్నె  సమీపంలో వున్న  భూమిని పరిశీలించారు. అంతకుమునుపు బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్ మీటింగ్ హాల్‌లో  బ్రహ్మణి ఇంజినీర్లు, స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిలతో కలిసి చర్చించారు.
 
 నియోజకవర్గంలోనే  చేపట్టాలి..
 జమ్మలమడుగు నియోజకవర్గంలోనే స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే కడప ప్రాంతంలో ఎయిర్‌పోర్టుతో పాటు  విద్య,వైద్యపరంగా  ఎన్నో సదుపాయాలు సమకూరుతున్నాయన్నారు.
 
 వెనుకబడిన ప్రాంతమైన జమ్మలమడుగులో పరిశ్రమలు స్థాపించటానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చ ని, స్టీల్‌ప్లాంట్‌ను జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలని కోరా రు.   స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి కావలసిన నీటిని  మైలవరం, గండికోట జలాశయాలనుంచి తీసుకోవచ్చన్నారు.  ముడి సరుకులు రవాణా చేసుకోవటానికి నేషనల్ హైవేరోడ్డుతోపాటు, రైల్వే సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు. విద్యుత్ అవసరాల కోసం ఆర్టీపీపీ ఉందన్నారు.
 
 బ్రహ్మణిపై అనాసక్తి
 బహ్మణి  పరిశ్రమపై సెయిల్ అధికారులు అసక్తి చూపలేదు. పరిశ్రమ ఏర్పాటు కోసం చైనా నుంచి ముడిసరుకు తీసుకుని  వచ్చామని, ఓబుళాపురం నుంచి మైనింగ్ లీజు తీసుకున్నామని బ్రహ్మణి ప్రతినిధులు తెలిపారు.  చైనా నుంచి వచ్చిన మిషనరీ  పనికిరాదని ఓబుళాపురం గనులనుంచి  వచ్చే  ఐరన్ ఓర్ కంటే హోస్పేట్ ఐరన్‌ఓర్ నాణ్యమైనదిగా ఉంటుందని సూచిం చారు.  బ్రహ్మణి పరిశ్రమకు సంబంధించిన భూముల కేసులు హైకోర్టులో ఉండటంతో సెయిల్‌అధికారులు స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించకుండానే వెళ్లిపోయారు.
 
 20వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం..
 20వేల కోట్లతో  మూడు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భూములను  పరిశీలించారని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.గోపాల్ పేర్కొన్నారు. మైలవరం మండలంలోని  ఎం.కంబాలదిన్నె సమీపంలో ప్రభుత్వానికి సంబంధించిన 6వేల  ఎకరాల భూమి ఉండటంతో దానిని పరిశీలించామన్నారు.

 స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే నిరుద్యోగులకు ఉపాధితోపాటు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.  మూడు  మిలియన్ టన్నుల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుందన్నారు.  ఆర్డీఓ జి.రఘునాథరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.     
 
 అన్ని వనరులు : ఎమ్మెల్యే ఆది
  స్టీల్‌ప్లాంట్  నిర్మాణానికి జమ్మలమడుగు నియోజకవర్గం అన్నివిధాలుగా అనువైందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మైలవరం మండలంలోని లింగాపురం సమీపంలో ఉన్న టన్నెల్‌క్యాంపు ఆఫీసు వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.  బ్రహ్మణి ఆగిపోవడం,  రాష్ట్ర విభజన జరుగడంతో జిల్లాలో స్టీల్ ప్లాంట్  నిర్మాణం చేపడతామని కేంద్రప్రభుత్వం సూచించిందన్నారు.  
 
 అందులో భాగంగానే సెయిల్ కంపెనీ బృందం బ్రహ్మణి, కంబాలదిన్నె ప్రాంతాల్లో పర్యటించిందన్నారు. స్టీల్‌ప్లాంట్  నిర్మాణం జరిగితే లక్షకుటుంబాలు బాగుపడటంతోపాటు  అనుబంధంగా 10వేల కోట్ల పెట్టుబడులతో సంస్థలు వస్తాయన్నారు. అంతేకాకుండా  మెడికల్ , ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వస్తాయన్నారు. వైజాగ్ మాదిరిగా జమ్మలమడుగు సస్యశ్యామలం అవుతుందన్నారు.  ప్లాంట్‌కు  కావలసిన 750 మెగావాట్ల విద్యుత్‌ను ఆర్టీపీపీ, విండ్‌పవర్, సోలార్ సిస్టం ద్వారా వినియోగించుకోవచ్చన్నారు.    నేషనల్‌హైవే, రైల్వే లైన్ ఉన్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2500 ఎకరాలలోపే భూమి అవసరముంటుందని కంబాలదిన్నె సమీపంలో ఒకే చోట 6 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.
 

Advertisement
Advertisement