నీటి సంఘాల ఎన్నికల ఊసేది?
రెండేళ్ల క్రితం సిద్ధమై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఏడేళ్లుగా ఎన్నికలకు నోచుకోని నీటి సంఘాలు
చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణ, అభివృద్ధికి అవసరమైన నీటి సంఘాల పదవీకాలం ముగిసి ఏడేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదు. 2008 జనవరిలో జిల్లాలో దాదాపు 2.5లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల్లో టీసీలకు ఎన్నికలు నిర్వహించారు.
యలమంచిలి: నీటి సంఘాల ఎన్నికల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2013 జనవరిలో సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించిన అప్పటి ప్రభుత్వం అదే స్ఫూర్తితో నీటి సంఘాలకు సైతం ఎన్నికలకు సిద్ధపడింది. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో అప్పట్లో వీటిజోలికి పోలేదు. సొసైటీ ఎన్నికల అనంతరం వెం టనే జిల్లా వ్యాప్తంగా ఉన్న టీసీలకు సంబంధించి రెవెన్యూ అధికారులకు మార్పులు, చేర్పులు, ఖాళీగా ఉన్న టీసీల వివరాలతో పాటు ఓటరు జాబితా త్వరగా అందించాలని ఆదేశించడంతో అధికారులు వివరాలు అందించారు. నోటిఫికేషన్ వెలువడనుందని అధికారులతో ఆఘమేఘాల మీద రిపోర్టులు తయారు చేయించారు. ఒత్తిడికి లోనై పనులు పూర్తి చేసినా ఎన్నికల ఊసెత్త లేదు. దీంతో రిపోర్టులు మళ్లీ తయారు చేయించాల్సిందేనని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. 2008 జనవరిలో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి నేటికీ వాటి ఊసేలేదు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆదేశాలతో ఆ లోపు నిర్వహించేందుకు సిద్ధమైనా చివరకు వెనక్కి తగ్గారు. నీటి సంఘానికి ఆరుగురు చొప్పున టీసీలు కేటాయించి సభ్యులను ఎన్నుకుంటారు.
చెరువు, ప్రాజెక్టుల పరిధిలోని సంబంధిత ఆయకట్టుదారులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. వీరు సంఘ సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులతో చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. కాగా సభ్యుల పదవీకాలం ఎమ్మెల్సీ మాదిరి ఆరుగురిలో ఇద్దరు రెండేళ్లు, మరో ఇద్దరు నాలుగేళ్లు, మిగతా ఇద్దరు ఆరేళ్లు ఉంటారు. ప్రతి రెండేళ్లకు పదవీ కాలం ముగిసిన సభ్యుల స్థానంలో ఎన్నికలు నిర్వహించి కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. 2008 నుంచి ఎన్నికల జోలికి వెళ్లకపోవడంతో కాలపరిమితి ముగిసి సంఘాలు లేకుండా పోయాయి. జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి దాదాపు 2.5లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో మేజర్, మీడియం, మైనర్ నీటి సంఘాల్లో టీసీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజాగా నోటిఫికేషన్ ఇస్తే మృతుల తొలగింపు, మార్పు చేర్పులు పోను ఆయకట్టు, సభ్యుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెరువుల కింది ఆయకట్టు వివరాలు నమోదు కాలేదు. కొన్ని ప్రాజెక్టులకు కాలువలు నిర్మించలేదు. నిర్మించిన చోట నిర్వహణ లేదు. నీటి సంఘం ఎన్నికలు నిర్వహిస్తే చాలా వరకు కాలువలు ఉపయోగంలోకి రావడంతో పాటు నిర్వహణకు ఎంతో కొంత నిధులు సమకూరే అవకాశం ఉన్నందున నీటి సంఘాల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.