నీటి కోసం..కోటి తిప్పలు..!
నీళ్లు వచ్చేటప్పుడు వీధి కుళాయిల వద్ద జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు గంటలే వచ్చే నీటిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలన్న తాపత్రయంతో పదులు.. ఇంకా చెప్పాలంటే వందల్లోనే ఉండే మహిళలు సిగపట్లు పట్టుకుంటారు. అటువంటిది 500 మందికి ఒక్క బోరే ఉంటే.. అదే అన్నింటికీ ఆధారమైతే.. రెండు మూడు గంటల్లో అందరి అవసరాలు తీరాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇదిగో.. ఈ ఫొటోనే అందుకు అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా నందిగాంలోని బాలికల సంక్షేమ వసతిగృహంలో ఉన్న ఈ బోరు.. దానితో విద్యార్థినులు జరుపుతున్న పోరు వివరాల్లోకి వెళితే.. ఈ వసతిగృహంలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న సుమారు 500 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అక్కడ ఉన్నది ఒకే ఒక్క బోరు.
కాలకృత్యాలు, బట్టలు ఉతుక్కోవడం.. ఇలా అన్ని అవసరాలకు ఇదే ఆధారం. మరోవైపు ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకోవాలి. ఈలోగానే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. దాంతో తెల్లవారుజామున 5 గంటలకు ఈ హాస్టల్లో హడావుడి మొదలవుతుంది. బాలికల ఉరుకులు.. పరుగులు.. బోరు వద్ద పెద్ద క్యూ.. తమ వంతు వచ్చే వరకు ఉగ్గబట్టుకొని వేచి చూడటం.. 8 గంటల్లోగా తమ వంతు రాకపోతే ఉసూరుమంటూ వెనుదిరగడం.. ఇదీ ఇక్కడి విద్యార్థినుల నిత్య పోరాటం..!
- ఫోటో: పీఎల్ మోహనరావు, సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం