'ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమం ఆగదు' | we dont stop our movement untill get special status to AP | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమం ఆగదు'

Published Thu, Aug 6 2015 8:32 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

we dont stop our movement untill get special status to AP

కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేవరకూ ఉద్యమం ఆగదని వైఎస్‌ఆర్ సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా స్పష్టం చేశారు. స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కలిసి తమ స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేశాయన్నారు. రాజధాని లేకుండా విభజించిన ఏకైక రాష్ట్రం ఇదేనన్నారు. 60 ఏళ్లపాటు ఇరురాష్ట్ర ప్రజలు కలిసి నిర్మించుకొన్న హైదరాబాద్ రాజధానిని తెలంగాణకు ఇవ్వడం బాధాకరమన్నారు.

పార్లమెంటులో విభజన అంశాన్ని టేబుల్ ఎజెండాగా ప్రవేశపెట్టి, తలుపులు వేసి అత్యంత దుర్మార్గంగా విభజన చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కట్టడి చేయడానికే వారు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని నిందించారు. తెలంగాణ వారు కోరక మునుపే తమకు సమ్మతమేనని టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు అయ్యాక రెండు కళ్ల సిద్ధాంతమంటూ ఇరు రాష్ట్రాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. ఆనాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని పట్టుబట్టిన బీజేపీ ఈనాడు మాట తప్పడం దారుణమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని తెలిపారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యపక్షంగా కొనసాగుతున్నందున ఆ పార్టీ అధ్యక్షుడుగానీ, ఆ పార్టీ ఎంపీలుగానీ ప్రత్యేక హోదాపై మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని టీడీపీ చెప్పడం సరికాదన్నారు.

ఆ ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు వ్యక్తిగత ప్యాకేజీనా, పార్టీ ప్యాకేజీనా చెప్పాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏ ఒక్కచోటా ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రజలందరూ పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 10వ తేది ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ కె. సురేష్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ పులి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement