నదుల రక్షణకు శ్రీకారం చుట్టింది మేమే
- ‘ర్యాలీ ఫర్ రివర్స్’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- నదుల రక్షణకు జాతీయ విధానం అవసరం : జగ్గీ వాసుదేవ్
- నదుల పక్కన నిర్మాణాలు సరికాదు : రాజేంద్రసింగ్
సాక్షి, అమరావతి: దేశంలో నదుల రక్షణకు శ్రీకారం చుట్టింది తామేనని, దీనికి ఒక విధానాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నదుల అనుసంధానం తాత్కాలికమని, నదుల పునరుజ్జీవం శాశ్వతమైన పరిష్కారమని తెలిపారు. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో జగ్గీవాసుదేవ్ ప్రారంభించిన యాత్ర విజయవాడ చేరుకున్న సందర్భంగా బుధవారం పీబీ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్‌లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1995లో తాను నదుల పునరుజ్జీవం, జలసంరక్షణ కోసం రాజేంద్రసింగ్‌తో కలసి పని చేశానన్నారు.
నదులకు ఇరువైపులా చెట్లు పెంచాలి
నదుల రక్షణకు జాతీయ విధానం అవసరమని, ఇందుకు ఒక చట్టం చేయాల్సి ఉందని జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది సహా దేశంలోని పలు ప్రధాన నదులు రాబోయే 25 ఏళ్లలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. కావేరి నదితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తనకు 17 సంవత్సరాలు వచ్చేవరకూ అందులో ఈత కొట్టానన్నారు. కావేరి నదిని తానొక జలవనరుగానే చూడటం లేదని.. అందులోనే తాను జీవితాన్ని చూశానన్నారు.
25 ఏళ్లుగా కావేరి సహా అన్ని ప్రధాన నదులు శుష్కించి, ఎండిపోవటం కళ్లారా చూశానని.. ఏడెనిమిదేళ్లుగా ఈ ప్రమాదం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2030 తర్వాత అనేక ప్రధాన నదులు సీజనల్ నదులుగా మారే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. నదులను పరిరక్షించాలంటే వాటికిరువైపులా ప్రభుత్వ, రైతుల భూముల్లో వనాలు, చెట్లు పెంచాలన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ నదులను నాశనం చేసే మనమే వాటి పునరుజ్జీవానికి కృషి చేయాల్సి ఉందన్నారు. నదుల పక్కన కట్టడాలు సరికాదని స్పష్టం చేశారు.