సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తుంది. పల్స్ ఆక్సీ మీటరు ద్వారా చెక్ చేసుకుంటూ ఆక్సిజన్ లెవెల్ తగ్గగానే ఆస్పత్రులకు పరుగు తీస్తాం. లక్షల మందికి తాగు, సాగునీరు అందించే గోదావరిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా ఎవరూ ఉలకరు పలకరు. కాలుష్యంతో కూడిన వ్యర్థాలు మురుగు కాలువల ద్వారా గోదావరిలో కలిసిపోతున్నా పట్టించుకోరు.
కాలుష్యం కోరల్లో చిక్కుకున్న గోదారమ్మను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నదిలో నీటి నాణ్యత అథమ స్థాయి డి–గ్రేడ్‌కు (చేపలు, జంతువులకు మాత్రమే పని చేస్తుంది) పడిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం నిర్ధారించింది. గోదావరి ప్రక్షాళనకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుంటే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఐదేళ్ల క్రితమే స్పష్టం చేసింది.
ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’
ఈ పావన నది ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ పేరిట కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకు చేసిన ప్రతిపాదనలకు ఇటీవల కేంద్ర ఆమోదం లభించింది. గోదావరి జన్మస్థలి నాసిక్ నుంచి చివరన రాజమహేంద్రవరం వరకూ నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.1,700.84 కోట్లతో ప్రతిపాదించింది. ఇందులో ‘నమామి గోదావరి’ పేరిట తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నదిలో జల కాలుష్య కట్టడికి రూ.400 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.87 కోట్లు ఇప్పటికే కేటాయించింది. కార్యాచరణ మొదలు కావాల్సి ఉంది.
కాలుష్యమిలా..
దేశవ్యాప్తంగా 351 నదుల్లో జల కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఆ నదుల జాబితాలో మన గోదావరి కూడా ఉంది. గోదావరి జలాల కాలుష్యంపై 2018లో ఎన్జీటీలో కేసు కూడా నమోదైంది. రాజమహేంద్రవరం నుంచి కోనసీమలోని సముద్ర మొగ వరకూ అడుగడుగునా గోదావరి కలుషితమవుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన రాజమహేంద్రవరంలో 5 లక్షల జనాభా ఉంది. ఈ నగరంలోని ఇళ్లల్లో వినియోగించిన నీరు, కాలువల్లో మురుగు కలిసి రోజుకు 60 మిలియన్ లీటర్లు (60 ఎంఎల్‌డీ) వస్తోంది. ఇందులో రోజూ 30 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే హుకుంపేట వద్ద మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ – ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసి గోదావరిలో విడిచి పెడుతున్నారు.
మూడు ప్రధాన కాలువల ద్వారా గోదావరికి మురుగు నీరు వచ్చి చేరుతుంది.
నల్లా చానల్: లోతట్టు ప్రాంతంగా ఉన్న రాజమహేంద్రవంలో వర్షాకాలంలో వచ్చే నీటిని పైపులైన్ల ద్వారా గోదావరిలోకి
తోడేందుకు నల్లా చానల్ ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఈ పైపులైన్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు.
ఆవ డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా మురుగునీటిని ధవళేశ్వరం వద్ద గోదావరిలో విడిచిపెడుతున్నారు.
మల్లయ్యపేట డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా పేపర్ మిల్లు ప్రాంతంలో మురుగు నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు.
గోదావరి ప్రక్షాళనకు చర్యలు
తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వద్ద మూడు కాలువల ద్వారా మురుగునీరు చేరుతోంది. రాజమహేంద్రవరంలో రోజుకు 60 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో చేరుతోంది. ఇందులో సగం మాత్రమే శుద్ధి చేసి విడిచిపెడుతున్నారు. మిగిలిన మురుగునీటిని కూడా శుద్ధి చేసే ప్రణాళిక సిద్ధమవుతోంది. నదీ కాలుష్యాన్ని నివారించగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది.
– ఎన్.అశోక్‌కుమార్, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ
కలవరం
కాలుష్య నియంత్ర మండలి కాకినాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ప్రతి నెలా గోదావరిలోకి మూడు కాలువల ద్వారా కలుస్తున్న మురుగు నీటి నమూనాలను లేబొరేటరీలో పరీక్షిస్తుంటే వస్తున్న ఫలితాలు కలవరపెడుతున్నాయి. మూడు శాతం ఉండాల్సిన బయో కెమికల్ ఆక్సిజన్ 70 శాతం నమోదవడం కాలుష్య తీవ్రతను చాటుతోంది. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) ఆధారంగా నీటి నాణ్యతను లెక్కిస్తారు. డీఓ పరిమాణం లీటరుకు కనీసం నాలుగు మిల్లీ గ్రాములుండాలి. బీఓడీ మూడు మిల్లీ గ్రాములు దాటకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ గోదావరిలో నాలుగు నుంచి తొమ్మిది శాతం వరకూ ఉందని గుర్తించారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో 50 పరిశ్రమలున్నాయి. వీటిల్లో కొన్ని పరిశ్రమల వ్యర్థాలు గోదావరి కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ఇదిగో సాక్ష్యం
గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకూ గోదావరి జలకాలుష్యంపై లేబొరేటరీ నివేదికలు.
నల్లా చానల్: బీఓడీ కనిష్టంగా 52, గరిష్టంగా 94 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 71.83గా తేలింది.
ఆవ డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 44, గరిష్టంగా 82 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 66.33గా గుర్తించారు.
మల్లయ్యపేట డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 50, గరిష్టంగా 114 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 78.33గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment