ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ
తెలంగాణలోనూ మేనేజ్‌మెంట్ సీట్లకు మేమే రాటిఫికేషన్ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ అధికారం తమకే ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. అందువల్లే తాము మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. ప్రవేశాలను యాజమాన్యాలు సెప్టెంబర్ 15లోగా పూర్తిచేసి, రాటిఫికేషన్ కోసం తమకు పంపించాలన్నారు. ఆయన సోమవారమిక్కడి మండలి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభ జన చట్టం ప్రకారం ఈ ఏడాది ప్రవేశాలు పూర్తిచేసే అధికారం ఏపీ ఉన్నత విద్యామండలికే ఉందని తెలిపారు. వచ్చే ఏడాదికి చెప్పలేమన్నారు.
ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాల్సినా ఇంకా కొనసాగిస్తున్నారని, రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమే అవుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. ప్రవేశాల విషయంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల ఒకటో తేదీన తరగతులు ప్రారంభమైనట్టేనన్నారు. సీట్లు ఎక్కువగా మిగిలిపోయినందున విద్యార్థులకు మార్పులకు అవకాశం కల్పించేందుకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని లేదని ఆయన వివరించారు.
మొదటి రోజు ఇంజనీరింగ్ ప్రవేశాలకు 28 వేల మంది
మెుదటి రోజు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం 28 వేల మంది హెల్ప్‌లైన్ కేంద్రాల్లో అనుమతి పొందారు. సోమవారం 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు పరిధిలోని 32,616 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా, సాయుంత్రం 6 గంటల వరకు 28 వేల మంది అనుమతి కోసం రిపోర్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రఘునాథ్ కొనసాగింపు: వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్ ఈనెల 31న పదవీ విరమణ పొందారు. అయితే ప్రవేశాల క్యాంపులో ఆయన సేవలు అవసరమని, ఆయనను కొనసాగించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాలు పూర్తయ్యే వరకూ ఏపీ తరపున ఆయన ప్రవేశాల క్యాంపులో కొనసాగిస్తున్నట్లు లేఖ ఇచ్చినట్లు మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ఆయన స్వస్థలం అనంతపురం కావడంతో ఆయన తనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని గతంలోనే అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన 31న పదవీ విరమణ పొందినా, ఏపీ ప్రభుత్వం ఆయున పదవీ విరవుణ కాలాన్ని రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది.