
ఆమోదయోగ్య విభజన : చంద్రబాబునాయుడు
ప్రజాగర్జనలో చంద్రబాబు డిమాండ్ సమైక్యం ఊసెత్తని వైనం
సాక్షి, తిరుపతి: ‘రాష్ట్ర విభజన ఇరుప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగానే జరగాలి. సీమాంధ్ర వారిని కట్టుబట్టలతో నిలబెట్టాలని చూస్తే ఊరుకోను. సరైన పరిష్కారం చూపిన తర్వాతే విభజన అంశంలో ముందుకెళ్లాలి..’ అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాను రాష్ట్ర విభజనకు అనుకూలమనే విషయం మరోమారు స్పష్టం చేశారు. తిరుపతిలో పార్టీ ప్రజాగర్జన సందర్భంగా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో సమైక్యమనే మాట ఒక్కసారి కూడా ఆయన నోటి నుంచి రాలేదు. మరోవైపు సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తన అక్కసు వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలంటూ వరుసబెట్టి ఎన్నికల హామీలిచ్చారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
ఆదివారం తిరుపతి లో నిర్వహించిన ప్రజాగర్జనలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రామలక్ష్మణులు మాదిరి ఉన్న రెండు ప్రాంతాల ప్రజలను వాల్మీకి సుగ్రీవుల్లా కాంగ్రెస్ మార్చిందన్నారు. విభజన పేరిట ఇరు ప్రాంతాలు వారు కొట్టుకుంటుంటే ‘రెండు కోతులు- పిల్లి -రొట్టెముక్కల వివాదం’ తీరున అన్ని అధికారాలను కేంద్రం లాక్కోవాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. విభజన సాకుతో కేంద్రం శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలోకి తెస్తున్నదని, అలాగే ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక అంశాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుని పిల్లకాలువ కట్టుకోవాలన్నా వారిని అడుక్కునేలా చేసేందుకు కుట్రపన్నిందని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసే సంప్రదాయానికి విరుద్ధంగా నేడు విభజన చేస్తున్నారని, ఇలా ఏ రాష్ట్ర విభజన సమయంలోనూ జరగలేదన్నారు. ఇరుప్రాంతాల వారికి న్యాయం చేసిన తరువాతే ముందుకెళ్ళాలని 2005లో తాను లేఖ ఇస్తే దానిని తప్పుపడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ప్రభంజనం చూసే.. ఒకేరోజు తెలంగాణ అంశానికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపడం, అదే రోజు కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించటం జరిగిపోయూయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
సోనియూ పెద్ద అనకొండ: లోక్‌పాల్ బిల్లుతో అవినీతి నిర్మూలనకు పాటుపడుతున్నామని కథలు చెబుతున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలే అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశంలో జరుగుతున్న అవినీతికి కర్త, కర్మ, క్రియ సోనియాగాంధీయేనని ఎద్దేవా చేశారు. అవినీతిలో సోనియాగాంధీనే ఒక పెద్ద అనకొండ పాము అని, ఆమె అల్లుడు రాబర్ట్ వధేరా ఇంకొక అనకొండ అని చెప్పారు. ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వధేరాకు నేడు వందల ఎకరాల భూములు, ఆస్తులు ఎలా సమకూరాయని, పెట్టుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘బక్కచిక్కిన కాంగ్రెస్‌ను ఒక పాముగా భావించి బతకమని పాలు పోస్తే అది గుడ్లు పెట్టి అవినీతి అనే పాములను తయారు చేసింది. ఆ పాములు మళ్ళీ దేశమంతా గుడ్లు పెట్టి దేశాన్ని దోచేశాయి..’ అంటూ కథ చెప్పారు. అలా వచ్చిన అనకొండల్లో ఒక అనకొండ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని, ఆయన వదిలివెళ్ళిన పిల్ల అనకొండే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని ఆరోపించారు.
సమైక్యవాదం ముసుగులో జగన్ సోనియావాదం వినిపించేందుకు వస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి వైఎస్‌ఆర్‌సీపీ వారు రాష్ట్ర విభజనకు, సోనియాగాంధీకి సహకరిస్తున్నారన్నారు. సోనియాగాంధీ ఆశీస్సులతో, ఆమెతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నందు వల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందనే విషయం అందరికీ తెలుసునన్నారు. పిల్ల కాంగ్రెస్‌కు ఓటెయ్యవద్దంటూ ఆ పార్టీ మీటింగ్‌లు విన్నా పాపాలు చుట్టుకుంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి రూ.30 వేల కోట్లు ప్రజల నెత్తిన మోపిందన్నారు. రాజీవ్ యువకిరణాలు ఎక్కడా కనపడటం లేదన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, మౌలిక సదుపాయూలు కొరవడ్డాయని విమర్శిం చారు. నిత్యావవసర వస్తువుల ధరలు ఆకాశంలో ఉన్నాయంటూ సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఎన్టీఆర్‌ను యుగపురుషుడంటూ అభివర్ణించారు.
గెలిపిస్తే మళ్లీ చక్రం తిప్పుతా!
2014 ఎన్నికల్లో గెలిపిస్తే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయల్లో మళ్ళీబచక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి నుంచి రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, డీ.కే.టీ పట్టాలను రెగ్యులరైజ్ చేయటంతో పాటు, అమ్ముకునే హక్కు కల్పిస్తామంటూ హామీల వర్షం కురిపించారు. వ్యసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. తిరుపతిని వాటికన్ నగరం మాదిరి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత మోడీ చెబుతున్నవి ఏనాడో తెలుగుదేశం చేసినవేనని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్డీయే అనుసరించిన విధానాలను పొగుడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు దిశగా సంకేతాలిచ్చారు. ఎన్నికలకు ఇక వంద రోజులే గడువుందంటూ.. మద్యం రేట్లు ప్రస్తావించి చివరకు మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు కూడా బాబు ప్రయత్నించారు.
నేతల కునికిపాట్లు: ఒకవైపు చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసమిస్తుంటే మరోవైపు ఆ పార్టీ నేతలు నిద్రతో కునికిపాట్లు పడుతూ కన్పిం చారు. టీడీపీ చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి కోడెల శివప్రసాదరావు, ఎంపీ శివప్రసాద్, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే పరసారత్నం, తిరుపతి నియోజవర్గ ఇన్‌చార్జి చదలవాడ క్రిష్ణమూర్తి వేదికపై నిద్రపోతూ కనిపించారు. బాబు విజన్ 2020 గురించి మాట్లాడటం ప్రారంభించిన కొద్దిసేపటికే జనం లేచి వెళ్ళిపోవటం మొదలెట్టారు.
సమైక్యం అన్నందుకే ఆహ్వానించట్లేదేమో: హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతి రేకించాలని కోరుతున్నందునే తనను టీడీ పీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆహ్వానిం చడంలేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యు డు నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్య క్తం చేశారు. ఆ కారణంగానే తిరుపతిలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు తనకు ఆహ్వానం రానట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.