రుణమాఫీపై చేనేతల ఆశలు | Weavers hopen crops loans of cancellation | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై చేనేతల ఆశలు

Published Sun, Jun 8 2014 2:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Weavers hopen crops loans of cancellation

మాఫీ అమలైతే 5,600 మంది కార్మికులకు లబ్ధి
 సాక్షి, అనంతపురం : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రుణమాఫీ హామీపై చేనేత కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఆదివారం గుంటూరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలతో పాటు చేనేతల రుణ మాఫీ ఫైలుపైనా సంతకం చేస్తారని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2012 నుంచి 2014 వరకు 5,600 మంది చేనేత కార్మికులకు సంబంధించి రూ.35 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి.
 
 రైతు రుణాలపైనే ఇప్పటి వరకు సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో చేనేతల రుణమాఫీ ఏ మేరకు అమలవుతుందన్న దానిపై ఇటు చేనేతలు, అటు బ్యాంకు అధికారుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. పూర్తి స్థాయి రుణాలు రద్దు చేస్తారా? లేక నిర్ణీత కాలవ్యవధిలో తీసుకున్న చేనేత రుణాలు రద్దవుతాయా? సొసైటీల ద్వారా తీసుకున్న రుణాలు రద్దుచేస్తారా? లేక వ్యక్తిగత రుణాలు మాత్రమే రద్దు చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. రుణమాఫీ అమలైతే జిల్లాలోని 5,600 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.
 
 అప్పుల ఊబిలో చేనేత కార్మికులు
 జిల్లాలో వ్యవసాయం తరువాత చేనేత అతిపెద్ద రంగం. పట్టు చీరలకు ధర్మవరం పెట్టింది పేరు. ప్రస్తుతం ధర్మవరంలో 18 వేల మగ్గాలు ఉన్నాయి. హిందూపురం (ముదిరెడ్డిపల్లి), సోమందేపల్లి, ఉరవకొండ, యాడికి, రాప్తాడు, సీకేపల్లి ప్రాంతాల్లోనూ పది వేల మగ్గాలు ఉన్నాయి. 11 రకాల చేనేత రిజర్వేషన్లను తుంగలో తొక్కిన పవర్‌లూమ్స్ యజమానులు వాటిని మరమగ్గాలపై తయారు చేసి.. తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో మగ్గంపై నేసిన పట్టుచీరలకు డిమాండ్ తగ్గుతూ వచ్చింది. పట్టుచీరల తయారీకి అవసరమై వార్పు, సప్పూరి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్ల క్రితం కిలో వార్పు రూ.2 వేలు ఉండగా ప్రస్తుతం రూ.3,600 చేరుకుంది.
 
 సప్పూరి రూ.2,100 నుంచి రూ.3,500కు చేరుకుంది. ఒక పట్టుచీర చేనేత మగ్గంపై నేయాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. ఒక చీర తయారీకి కూలి రూ.450 నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్లలో ముడిపట్టు, కూలి ధరలు పెరిగినా మార్కెట్‌లో పట్టుచీరల ధరలు మాత్రం పెరగలేదు. దీంతో చేనేతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వందలాది మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చాలా మంది చీరలు నేయడానికి పెట్టుబడుల కోసం వివిధ వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో రుణాలు రెండేళ్ల కాలానికి పెరిగి పెరిగి రూ.35 కోట్లకు చేరుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement