అమ్మను చూడాలని వెళ్లా
రాయచోటి టౌన్ : వీరబల్లిలోని కస్తూర్బా పాఠశాల నుంచి గురువారం అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. అమ్మను చూడాలనే తాను తన స్నేహితురాలిని వెంట తీసుకుని తిరుమలకు వెళ్లానని ఉషారె డ్డి అనే బాలిక పేర్కొంది. శనివారం బాలికలను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా రాయచోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వీరబల్లి మండలం గడికోట ఎడపల్లెకు చెందిన ఉషారెడ్డి వీరబల్లిలోని కస్తూ ర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు కామేశ్వరి, నాగారెడ్డి. ఉషారెడ్డి జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అప్పటి నుంచి ఆ బాలిక తండ్రి వద్దే ఉంటోంది. తల్లి తిరుమలలో చిరుద్యోగం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తన తల్లిని చూడాలనే ఉద్దేశంతో తనతో పాటు చదువుకుంటున్న చార్మి అనే బాలికతో తిరుపతికి వెళ్లి వద్దామని చెప్పింది. దీంతో ఆ బాలిక తన వద్ద ఉన్న రూ.200 తీసుకుని మరో బాలిక ను వెంట తీసుకుని బయలు దేరింది. తొలుత వీరు తిరుపతికి కాకుండా నేరుగా బస్సులో కదిరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి తిరుపతి బస్సు ఎక్కి వెళ్లారు.
అక్కడికి వెళ్లిన తర్వాత ఆ బాలిక తన తాతకు కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసి తాను అమ్మ వద్దకు వెళ్లి తిరిగి వస్తానని తన కోసం వెతక వద్దని చెప్పింది. ఈ విషయాన్ని అతను పోలీసులకు తెలిపాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ బాలికలు తిరుపతిలో ఉన్నారని తెలుసుకుని వీరబల్లి ఎస్‌ఐ భక్తవత్సలం తన సిబ్బందితో కలసి తిరుపతికి వెళ్లి గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో ఆ బాలిక మళ్లీ ఫోన్ చేసి తాను అమ్మ వద్దకు వెళ్తున్నానని చెప్పింది. ఆ ఫోన్ నెంబర్ తిరుమలదని తెలుసుకున్న పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో తిరుమలలో గాలిస్తుండగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరబల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులని తెలిసింది. దీం తో వారిని రాయచోటికి తీసుకొచ్చారు. అలాగే ఆ బాలిక తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్‌కు పిలిపించి బాలికను అప్పగించారు. మరో బాలిక తల్లిదండ్రులను కూడా పిలిపించి విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏఎస్పీ తెలిపారు.