కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శివలింగానికి గోదావరి జలాలతో అభిషేకం చేస్తున్న తానేటి వనిత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: విశాఖలో హత్యాయత్నం ఘటనలో గాయపడిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకే భద్రత కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే.. ఇక సామాన్య ప్రజలకు ఏవిధంగా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు గతంలో తామెన్నడూ చూడలేదన్నారు. ఒకవైపు జగన్‌పై హత్యాయత్నం జరిగి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోట్లాది ప్రజలు, అభిమానులు ఆందో ళన చెందుతుంటే సీఎం చంద్రబాబు, వారి మం త్రులు, కొందరు ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ప్రజలంతా చూశారన్నారు.
ఈ కార్యక్రమంలోఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షులు మంచెం మైబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిదేశి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో సర్వమత పూజా, ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శివాలయం, పడమర రేగులకుంటలోని చర్చిలో, స్థానిక మసీదులో ప్రత్యేక పూజలు, ప్రార్థన, నమాజ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరాటం కృష్ణ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. కుక్కునూరు మండలంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో గోష్పాదక్షేత్రంలో శివలింగానికి పూజలు నిర్వహించారు. టౌన్‌చర్చిలో ప్రార్థనలు చేశారు. కొవ్వూరు జామీయా మసీదులో నమాజ్ చేశారు. తాళ్లపూడిలో నల్లరిబ్బన్లు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ పూజలు నిర్వహించారు.
జూబ్లీ రోడ్డులోని లూథరన్ చర్చిలో ప్రార్ధనలు, పాతూరు పెద్ద మసీదులో నమాజ్ నిర్వహించారు. ఏలూరు రూరల్ మండలం పాలగూడెంలో దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాట్నాలకుంటలో రాట్నాలమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీరామవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు క్యాండిల్స్‌తో నిరసన ర్యాలీ నిర్వహించారు. చింతలపూడిలో స్ధానిక షిరిడీ సాయిబాబా ఆలయంలో మండల వైఎస్‌ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం 108 కొబ్బరి కాయలు కొట్టారు. ఉండ్రాజవరం శ్రీగోకర్ణేశ్వరస్వామి ఆలయంలో జగన్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మాజీ ఎమ్మెల్యే జీఎస్.రావు పూజలు నిర్వహించారు. ఉండ్రాజవరంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఆచంట నియోజకవర్గం మార్టేరులోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నేతలు ప్రత్యేక పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం మసీద్‌లో వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ భీమడోలు శివాలయంలో ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు పూజలు నిర్వహించారు. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో జగన్ ఆరోగ్యం కోలుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు పూజలు నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కవురు శ్రీనివాస్, అచంట సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు, చింతలపూడి సమన్వయకర్త వీఆర్ ఎలిజా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు హైదరాబాద్ వెళ్లి గాయపడిన జగన్‌మోహనరెడ్డిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment