సాక్షి, పశ్చిమ గోదావరి : అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను రద్దు చేస్తామని చంద్రబాబు చేసిన సంతకానికి విలువ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. బడి, గుడి, వీధి చివరా.. ఎక్కడా చూసినా బెల్ట్ షాప్‌లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వీటి నిర్వహణకు అండగా టీడీపీ నాయకులు నిలబడుతున్నారని, ఎంఆర్‌పీ కంటే 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాటాలు పంచుతూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని అన్నారు. తాళ్లపూడి, తాడిపూడి, బల్లిపాడు, చిడిపి, పక్కిలంక, కొవ్వూరు, పోగిమ్మి ర్యాంపుల నుంచి ప్రొక్లెయిన్‌లు పెట్టి రోజూ వేల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
పుష్కరాలను వదలలేదు..
గోదారి తీరాన రిసార్ట్స్ కట్టిన మంత్రి కుమారుడు మరింత అన్యాయంగా వ్యవహరించారు. అడ్డుగా ఉన్నాయని దేవతల విగ్రహాలను సైతం తొలగించారు. జిల్లాలో జరిగిన పుష్కరాలో సైతం అవినీతి లేకుండా పనులు సాగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, అలా జరగలేదు. చెత్త ఏరివేయడం.. ఘాట్ల నిర్మాణం.. తదితర పనులను నామినేషన్ల పద్ధతిలో చేపట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కొలిక్కి రాలేదు. చంద్రబాబు పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. మోసం. మోసం. పొరపాటున బాబుకు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు. బాబుకు మళ్లీ ఓటేస్తే.. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు బాదుడే.. బాదుడు. భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. భూ రికార్డులను సైతం తారుమారు చేశారు. పొరపాటున బాబుకు ఓటేస్తే మీ భూములను లాక్కుంటారు.
లారీ ఇసుక లక్ష అవుతుంది..
ఇప్పటికే లారీ ఇసుక రూ.40 వేలు. మళ్లీ బాబును నమ్మి మోసపోతే.. లారీ ఇసుక లక్ష రూపాయలు అవుతుంది. రైతులకు ఉచిత విద్యుత్ సరిగా అందడం లేదు. ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేశారు. పొరపాటున బాబుకు ఓటేస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు సైతం ఇవ్వనివ్వరు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు అనుకూలమైన పోలీసులను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను అధికారులను రానివ్వడం లేదు. రాబోయే రోజుల్లో మనుషులను చంపేసినా అగిగేవారుండరు. పొరపాటున బాబుకు ఓటేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి వారికి ఉద్యోగాలుండవు. జడ్జీ పదవులకు బీసీలు అనర్హులని ఇప్పటికే బాబు లేఖలు రాశారు. మరోసారి చంద్రబాబు అబద్ధాలకు మోసపోవద్దని కోరుతున్నా. వైఎస్సార్‌సీపీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
20 రోజులు ఓపిక పట్టండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు మరింత పెరుగుతాయి. ఆయన చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పండి. ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చయినా అన్న చదివిస్తాడని చెప్పండి. డ్వాక్వా మహిళలకు చెప్పండి.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని చెప్పండి. బ్యాంకులకు సగర్వంగా వెళ్లే రోజులు మళ్లీ వస్తాయని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 45 ఏళ్లు దాటి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు ఇస్తామని చెప్పండి. ప్రతి రైతన్నకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పండి. అవ్వా తాతల పెన్షన్ రూ.3 వేల వరకు పెంచుతామని చెప్పండి.
Comments
Please login to add a commentAdd a comment