అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 32 వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి పైగా కార్యాలయాలు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కన్పించడం లేదు. రాష్ట్ర విభజన తరువాత సెంట్రర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) కాస్త సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌పీడీసీఎల్)గా రూపాంతరం చెందింది. అప్పట్నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. రాష్ట్ర విభజనకు ముందు నుంచి పెద్దసంఖ్యలో రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం, హిందూపురం, కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం డివిజన్లలో అధికారికంగా 1,97,986 వ్యవసాయ కనెక్షన్లు, 57 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి.
రైతులు వేలాది రూపాయలు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. నీళ్లు పడిన రైతులు పంటలు పండించుకుందామనుకుంటే వ్యవసాయ కనెక్షన్లు అందని ద్రాక్షగా మారాయి. డీడీలతో పాటు దరఖాస్తు చేస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 32 వేల మంది రైతులు రూ.20 కోట్లకు పైగా డీడీలు చెల్లించి ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నారు. 32 వేల కనెక్షన్లు ఇవ్వాలంటే 60 వేల స్తంభాలు, ఏడు వేల ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం. ఏడు వేల కిలోమీటర్ల వైరు (కేబుల్) కూడా కావాలి.
నెలకు 600 ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్ వస్తే కానీ సమస్య నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. దీనికి తోడు జిల్లాలో ఉన్న 57 వేల ట్రాన్స్‌ఫార్మర్లలో నెలకు 500 దాకా రిపేరీకి వస్తుంటాయి. వీటి స్థానంలో తక్షణం ఇవ్వాల్సి ఉంటుంది. రోలింగ్‌స్టాకు నుంచి ఇస్తున్నా అవి కూడా మళ్లీ మళ్లీ రిపేరీకి వస్తున్నాయి. దీంతో విద్యుత్‌శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ కింద 3-4 వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ఓల్టేజీ సమస్య తలెత్తదు. కొన్ని చోట్ల ఐదారు సర్వీసులు ఉండటంతో లోడ్ ఎక్కువై ట్రాన్స్‌ఫార్మర్లు పదే పదే కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
నెలకు కొత్తగా 600 ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా కావాల్సి ఉండగా 40-50కు మించడం లేదని వారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదు. రెండు, మూడేళ్లు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. సమస్య తీవ్రతను జిల్లా అధికారులు ఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించడం లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జూన్ 26న అనంతపురం మార్కెట్‌యార్డులో జరిగిన విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభోత్సవంలో జిల్లా మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు.
రెండు నెలలు గడిచేసరికి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం అంత సులభం కాదనే విషయం మంత్రికి కూడా అర్థమైపోయింది. అందులో భాగంగానే ఆదివారం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కనెక్షన్లు ఎప్పుడిస్తారనే విషయాన్ని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఆర్‌ఎన్ ప్రసాదరెడ్డి కూడా చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి రైతులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.
ఎప్పుడిస్తారో?
Published Mon, Aug 25 2014 2:54 AM | Last Updated on Fri, Aug 17 2018 5:52 PM
Advertisement
Advertisement