శాస్త్రీయ అధ్యయనం ఏది? | Where is the scientific study? | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ అధ్యయనం ఏది?

Published Mon, Apr 18 2016 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

శాస్త్రీయ అధ్యయనం ఏది?

శాస్త్రీయ అధ్యయనం ఏది?

♦ రాజధాని నిర్మాణాలు సరికాదు
♦ భారీ ప్లాట్‌ఫామ్‌తో ఇబ్బందే: ప్రొఫెసర్ కుందూ
♦ భారీ మూల్యం తప్పదు: ప్రొఫెసర్ రామచంద్రయ్య
 
 విజయవాడ (గాంధీనగర్):
శాస్త్రీయ అధ్యయనం చేయకుండా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడం సరికాదని ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) న్యూఢిల్లీ ప్రొఫెసర్ అమితాబ్ కుందూ చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ఎంపిక విషయమై కేంద్రహోం శాఖ నియమించిన  శివరామకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని నిర్మాణం చేపట్టకపోయినా, దానిపై కనీసం చర్చలు, సంప్రదింపులు జరపాల్సిందన్న ఆభిప్రాయం వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పక్కనబెట్టిందన్నారు. తాను ఎన్నో కమిటీల్లో పనిచేశానని, ఇలా ఏ ప్రభుత్వమూ వ్యవహరించలేదన్నారు.

రాజధాని అమరావతి వంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వ్యక్తుల ఆలోచనా విధానం మేరకు కాకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి  రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడం ఎంత మాత్రమూ సబబు కాదన్నారు. ప్రభుత్వం  వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయరంగం ద్వారా వస్తున్న ఉపాధిని పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానిలో  6నుంచి 8 అడుగుల ఎత్తున ప్లాట్‌ఫామ్ నిర్మించి ఇతర నిర్మాణాలను చేపడుతున్నారని, దీనివలన రాజధాని పరిసరప్రాంత గ్రామాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.

సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ రాజధానికి 33వేల ఎకరాలు సమీకరించి, మాస్టర్‌ప్లాన్ రూపొందించిన తర్వాత అధ్యయన కమిటీ వేయడాన్ని ఓ తంతుగా అభివర్ణించారు. ప్రభుత్వానికి ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఈనెల 22న వాయిదా ఉందని, ఈ నేపథ్యంలోనే హడావుడిగా కమిటీ వేశారన్నారు. సీడ్ రాజధాని ప్రాంతంలో 8 అడుగుల ఎత్తు పెంచితే సమీప గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏపీ రాజధాని ప్రజలకు గుదిబండగా మారబోతుందన్నారు. అన్ని రకాలుగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దళిత నాయకుడు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ అసెన్ ్డభూములు కొనుగోలు చేసిన తన అనుయాయులను కాపాడేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

Advertisement

పోల్

Advertisement