
ఎవరి పని?.. టార్గెట్ ఎవరు?
- కోర్టు ఆవరణలో బాంబు పేలుడుపై ఎన్నో అనుమానాలు
- చిత్తూరులో కలకలం
జిల్లా కేంద్రమైన చిత్తూరు హత్యలు, బాంబు పేలుళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఐదు నెలల క్రితం దుండగులు స్థానిక మేయర్ దంపతులను అతికిరాతకంగా హతమార్చారు. ఆ రక్తపు మరకలు చెరగకముందే గురువారం పట్టపగలే కోర్టు ఆవరణలో బాంబులు పెట్టి కలకలం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే దీనివెనుక ఎవరి హస్తముంది.. టార్గెట్ ఎవరు..? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. మేయర్ దంపతులను హతమార్చినవారిని మట్టుబెట్టడానికే ప్రత్యర్థులు పథకం వేశారా.. లేక నిందితులు కేసు విచారణను వేరే జిల్లాకు మార్చుకునేందుకు పథకం పన్నారా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నడిబొడ్డున ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనురాధ దంపతుల్ని అతి కిరాతంగా హత్య చేసిన ఘటన మరువకముందే ఇప్పుడు కోర్టు ఆవరణలో బాంబు పేలు డు కలకలం సృష్టించింది. త్రుటిలో తప్పిందిగానీ..! లేకుంటే ఈ ఘటనలో ఊహించని రీతిలో ప్రాణ నష్టం జరిగేది.
ఎవరో?
కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు పలు నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉన్న వాళ్ల కోసమే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరిని లక్ష్యంగా చేసుకుని బాంబు పేల్చారనే దానిపై స్పష్టతరావడంలేదు. గత ఏడాది నవంబర్ 17న జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా మొత్తం 23 మందిపై పోలీసులు కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. అయితే గత సోమవారం ఈ కేసు విచారణ ప్రధాన ఘట్టానికి చేరుకుంది. జంట హత్యల కేసుల విచారణను జిల్లా సెషన్స్ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ, మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణకు షెడ్యుల్ విడుదల చేసి నిందితులను, సాక్ష్యులను విచారించడమే తరువాయి. ఇలాంటి సమయంలో చిత్తూరు కోర్టులో జరిగిన పేలుడు పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రత్యర్థుల పనేనా?
ఈ ఘటనలో మరో వాదన కూడా వినిపిస్తోంది. చింటూ లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ఎవరైనా బాంబు పేల్చారా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చింటూ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానానికి హాజరై వెళుతుండగా అతన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాన్ని తరలించడాని ప్రయత్నిస్తూ పొరపాటున బాంబు పేలిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిఘా ఏదీ?
చిత్తూరు కోర్టులో చోటుచేసుకున్న ఘటన మరోమారు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. మేయర్ దంపతుల హత్య కేసులో పరువు పోగొట్టున్న పోలీసు శాఖకు కోర్టులో బాంబు పేలుడు ఘటన అధికారు ల పనితీరును ప్రశ్నిస్తోంది. జంట హత్యల కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న పది మంది బెయిల్‌పై విడుదలయ్యారు. అలాగే ఈ కేసుల్లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండ టం, చింటూకు సన్నిహితంగా ఉన్న పలువురు అరెస్ట్ అయినా బెయిల్‌పై ఉన్నారు. వీళ్ల కదలికలపై నిఘా ఉంచడం, బెయిల్‌పై వచ్చిన వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఎవరెవరితో మాట్లాడుతున్నారు..? అనే వివరాలను తెలుసుకోవాల్సిన స్పెషల్ బ్రాంచ్, నిఘా వర్గాలు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కోర్టులో పేలుడు హేయమైన చర్య
చిత్తూరు కోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన బాంబు పేలుడు అత్యంత హేయమైన చర్య. ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. ఈ ఘటనకు పాల్పడ్డ వాళ్లు ఎంతటి వారైనా వదలకూడదు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి.
- పులికల్లు రవీంద్రనాథ రెడ్డి, చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
కోర్టులో పేలుడు ఘటన ప్రజల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. దోషుల్ని న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. -వీ. సురేంద్రకుమార్, ఆలిండియా లాయర్స్ యూనియన్ చిత్తూరు విభాగం అధ్యక్షుడు
అందరికీ రక్షణ కల్పించాలి
చిత్తూరులో కోర్టులో జరిగిన పేలుడు ఘటనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించి ఇక్కడ అందరికీ రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలి. గాయపడ్డ న్యాయవాద గుమస్తా బాలాజీ వైద్యానికి అయ్యేక ఖర్చు ప్రభుత్వమే ఖర్చులు భరించాలి.
- సుగుణ శేఖర్ రెడ్డి, ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) చిత్తూరు విభాగం కార్యదర్శి