హోరాహోరీ పోరులో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం | win in Gold Cup hockey tournament : ysr district team | Sakshi
Sakshi News home page

హోరాహోరీ పోరులో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం

Published Mon, Dec 15 2014 3:25 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

హోరాహోరీ పోరులో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం - Sakshi

హోరాహోరీ పోరులో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం

మదనపల్లె క్రైం : ఏపీ స్కూల్‌గేమ్స్ అండర్-19 రాష్ట్ర స్థాయి గోల్డ్‌కప్ హాకీ పోటీల్లో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం, వైఎస్సార్ జిల్లా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మొదటి స్పెల్‌లో వైఎస్సార్ జిల్లా జట్టు ఒక గోల్‌తో పైచేయి సాధించింది. తర్వాత గోల్ కోసం ఇరు జట్లు శ్రమించాయి. ఆట రెండు నిముషాల్లో ముగుస్తుందనగా అంపైర్ ఇచ్చిన ఫెనాల్టి కిక్‌ను అనంతపురం జట్టు గోల్‌గా మలిచి స్కోరును సమం చేసింది.

అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఫెనాల్టీ ఇచ్చాడని వైఎస్సార్ జిల్లా క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు చెరొక గోల్‌తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. అం పైర్లు షూటౌట్‌కు 8 సెకండ్లు కేటాయించారు. ఇరు జట్లు రెండేసి గోల్స్ చేయడంతో రెండో షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. మొదట అనంతపురం జట్టు క్రీడాకారుడు గోల్ చేయలేకపోయాడు.

తర్వాత వచ్చిన వైఎస్సార్ జిల్లా క్రీడాకారుడు బాలాజీ గోల్ సాధించడంతో ఆ జట్టు విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్స్‌లో వైఎస్సార్-నెల్లూరు జట్లు తలపడగా 6-0 తేడాతో వైఎస్సార్ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్‌లో అనంతపురం-విశాఖపట్నం తలపడగా 3-0తో అనంతపురం గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. నెల్లూరుపై 5-0తో విజయం సాధించి విశాఖపట్నం మూడో స్థానం దక్కించుకుంది.
 
బాలికల విభాగంలో: బాలికల విభాగంలో అనంతపురం-వైఎస్సార్ జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2-0తేడాతో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. వైఎస్సార్ జిల్లా జట్టు రెండో స్థానం దక్కించుకుంది. మూడో స్థానానికి జరిగిన పోటీలో వైజాగ్‌పై 3-0తేడాతో చిత్తూరు జట్టు జయకేతనం ఎగుర వేసింది.
 
బెస్ట్ ప్లేయర్ అవార్డులు : బాలుర విభాగంలో పది గోల్స్ సాధించిన వైఎస్సార్ జిల్లా జట్టు క్రీడాకారుడు అరవింద్‌కు బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది. బాలికల విభాగంలో పది గోల్స్ సాధించిన అనంతపురం జట్టు క్రీడాకారిణి మహాలక్ష్మికి బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది.
 
ఢిల్లీ స్థాయిలో ప్రతిభ చాటాలి: న్యూఢిల్లీలో జనవరి రెండో తేదీ నుంచి జరిగే స్కూల్‌గేమ్స్ అండర్-19 హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ పేరును ఢిల్లీ స్థాయిలో వినిపించాలని మల్లయ్యకొండ మాజీ చైర్మన్ మద్దిరెడ్డి ఆకాంక్షించారు. స్కూల్‌గేమ్స్ అండర్-19 గోల్డ్‌కప్ హాకీ పోటీల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల శిక్షణకు కావాల్సిన సహాయసహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం బాలుర విభాగంలో విజేతలకు మద్దిరెడ్డి చేతుల మీదుగా హాకీ గోల్డ్‌కప్, చాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేశారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన అనంతపురం, విశాఖపట్నం జట్లకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు.

బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్టుకు గోల్డ్‌కప్‌ను, చాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేశారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వైఎస్సార్, చిత్తూరు జిల్లా జట్లకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. బెస్ట్ ప్లేయర్స్‌కు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి షాజహాన్, అబ్జర్వర్ రామకృష్ణదొరై, పీడీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌జీ.గిరిరావు, సుబ్రమణ్యం, రామా, పీఈటీలు నరేష్, నౌషాద్, సీఐ చంద్రశేఖర్, పట్టణ ప్రముఖులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement