ఫోర్జరీ సంతకంతో కో-ఆప్షన్ ఎన్నిక | With the co-option election forgery | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకంతో కో-ఆప్షన్ ఎన్నిక

Published Thu, Sep 4 2014 1:46 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

With the co-option election forgery

  • మున్సిపల్ చైర్మన్‌ను నిలదీసిన  టీడీపీ కౌన్సిలర్
  •   టీడీపీకి కాంగ్రెస్ అండదండలు
  •  గందరగోళంగా ముగిసిన  కో-ఆప్షన్ ఎన్నికలు
  •  నిబంధనలకు విరుద్ధమన్న  వైఎస్సార్ సీపీ నాయకులు
  •  మున్సిపల్ కార్యాలయం వద్దే ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ నాయకులు
  • శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి తన ఫోర్జరీ సంతకంతోనే పూర్తి చేశారని అదే పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ నాగరాణి దుయ్యపట్టారు. దీంతో సమావేశం గందరగోళానికి దారితీసింది.

    పలువురు టీడీపీ కౌన్సిలర్లు ఎన్నికను వ్యతిరేకించారు. వైఎస్సార్ సీపీ కి చెందిన 11మంది కౌన్సిలర్లు కార్యాలయం ముందే బైఠాయించి, ధర్నాకు దిగారు. ఎన్నికల సమావేశానికి హజరుకాలేదు. అయినా మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్ల సహాయంతో కో-ఆప్షన్ ఎన్నికను తూతూమంత్రంగా ముగించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

    ఆగస్టు 30వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో కో-ఆప్షన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. తిరిగి బుధవారం నిర్వహించడానికి నిర్ణయించారు. అయితే వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ సమావేశానికి హజరుకాకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుటే బైఠాయిం చారు. చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు.

    ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్‌లీడర్ మిద్దెల హరి మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన కో-ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారని, నోటిపికేషన్ విడుదల చేసిన 15 రోజుల్లో కో-ఆప్షన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అయితే ఆగస్టు 30వ తేదీన సర్వసభ్య సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడిందన్నారు.

    దీంతో ఈ నెల 3వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి, కమిషనర్ శ్రీలక్ష్మి లేకపోయినప్పటికీ డెలిగేట్ కమిషనర్ పీవీరావు ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా కో-ఆప్షన్ ఎన్నిక ముగిం చి, సమావేశం కూడా నిర్వహించకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్లు పూర్తి మద్దతు తెలపకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లుతో కుమ్మకై నామమాత్రంగా ఎన్నికలు ని ర్వహించారని విమర్శించారు. అంతేకాకుండా 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌తో పాటు పలు ఫో ర్జరీ సంతకాలు చేసి, ఎన్నికలు పూర్తి చేశారని ఆరోపించారు. వెంటనే చైర్మన్ పేట రాధారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు.

    అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్ వద్ద కూడా ప్లకార్డులతో నినాదాలు చేశారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్ పేటరాధారెడ్డి మాట్లాడుతూ 35 మంది కౌన్సిలర్లుకు గాను 19 మంది మద్దతు ఉండడంతో కో-ఆప్షన్ ఎన్నికలు పూర్తి చేశామని, తాము ఫోర్జరీ సంతకాలు చేయలేదని తెలిపారు. కో-ఆప్షన్ సభ్యులుగా ధనంజయులు, షాకీర్‌ఆలీ, షాహిద్‌బేగంను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement