ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి
- భావితరాల కోసమే 29న రాష్ట్ర బంద్
- అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి
- పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు
అనంతపురం : రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈ నెల 29న చేపడుతున్న బంద్ విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలోని వీకే మెమోరియల్ హాలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెనుకొండ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు సోనియాగాంధీనే ఎదిరించి పోరాటం చేశామని, ఆ క్రమంలో మన అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అదే స్ఫూర్తితో ఈ రోజు మనందరం కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. బీజేపీ, టీడీపీకి ఓట్లు వేయించిన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అనంతపురం జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లని, మన గళం ఢిల్లీ పెద్దల గుండెల్లో దడ పుట్టించాలని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తనదేనన్నారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, ప్యాకేజీ సాధించుకోవడానికి బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ.24 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు పోరాటాలు కొనసాగించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈ నెల 10న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బంద్‌కు పిలుపునిస్తే.. దీన్ని అడ్డుకోవాలని అధికార పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దిగుజారుడు విమర్శలకు దిగడం సిగ్గుచేటు అన్నారు. ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బంద్ ఉద్దేశాన్ని ప్రజలకు తెలిపేందుకు కరపత్రాలు, పోస్టర్లు, బైకు ర్యాలీల ద్వారా విసృ్తత ప్రచారం నిర్వహించాలని సూచించారు.