మహిళా ప్రతినిధులపై టీడీపీలో చిన్నచూపు
అనపర్తి:టీడీపీకి చెందిన పలువురు నాయకులు పార్టీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీకి చెందిన అనపర్తి-2 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు చిర్ల శ్రీదేవి ఆరోపించారు. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసిన శ్రీదేవి ఈ నెల 13న నిద్ర మాత్రలు మింగారు. ఇరుగుపొరుగువారు, పుట్టింటి వారు ఆస్పత్రిలో చేర్చగా గండం గడిచి కోలుకున్న ఆమె సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భర్త నటశేఖరరెడ్డికి, తనకు మధ్య ఉన్న తగాదాలను పరిష్కరిస్తామని పార్టీ నాయకులు అనడంతో ఈ నెల 13న పార్టీ స్థానిక కార్యాలయానికి వెళ్లానని చెప్పారు.
అయితే పార్టీ నాయకులు కర్రి ధర్మారెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి ఏకపక్షంగా తన భర్తకే వత్తాసు పలికారని ఆరోపించారు. అదే రోజు సాయంత్రం భర్త, భర్త అన్న కుమారుడు తనను చంపేందుకు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. అనంతరం తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానన్నారు. అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యురాలైన తనకు పార్టీ నాయకుల వల్ల న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో తాను నిద్ర మాత్రలు మింగ గా ఇంతవరకూ పరామర్శించిన నాయకుడు లేకపోవడం బాధాకరమన్నారు. పార్టీ నాయకులు తనకు అన్యాయం చేసినా పార్టీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే ఉండి వారి అన్యాయాలను ఎండగడతానని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.