ఆరోగ్యమస్తు | womens Focus on Aerobic exercise | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు

Published Sun, Sep 16 2018 7:50 AM | Last Updated on Sun, Sep 16 2018 7:50 AM

womens Focus on Aerobic exercise - Sakshi

ఒకప్పుడు సౌందర్యంపైనే మక్కువ చూపిన మహిళలు నేడు శారీరక ఫిట్‌నెస్‌పై  దృష్టి సారిస్తున్నారు. పురుషులకు దీటుగా మహిళలు సైతం వ్యాయామంతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సులపై ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉదయం..సాయంత్రం వేళల్లో  తీరిక దొరికినప్పుడు వాకింగ్‌ చేస్తూ ఒబెసిటీ లాంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): నిత్యం ఒడిదుడుకుల జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార అలవాట్ల కారణంగా అత్యధిక శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఒబెసిటీ బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధిక శాతం ఉంటున్నట్లు అంచనా. నగర జనాభాలో 33 శాతం మంది ఒబెసీటీతో బాధపడుతుంటే మహిళలు 40 శాతంగా ఉన్నట్లు అంచనా. ఒబెసిటీ మహిళల్లో  13 నుంచి 18 ఏళ్ల వారు 20 శాతం మందిæ, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారు 33 శాతం మంది, 35 ఆ పైన వయస్సు కలిగిన వారు 40 శాతం మంది ఉన్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వంటి వ్యా«ధులతో పాటు నడుంనొప్పి వంటి సమస్యలు వీరు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీని అధిగమించేందుకు  మహిళలు ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు. 

వ్యాయామంపై ప్రత్యేక దృష్టి 
ఉదయం, సాయంత్రం పురుషులతో పాటు, మహిళలు వాకింగ్‌ చేస్తున్నారు. వాకింగ్‌ చేస్తున్న వారిలో 45 ఏళ్లు పైబడినవారు ఉంటున్నారు. కాగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు ఏరోబిక్‌ చేస్తుండగా, యువత జుంబా డ్యాన్స్‌పై మక్కువ చూపుతున్నారు. దీంతో మహిళల కోసం ప్రత్యేక ఫిట్‌నెస్‌ సెంటర్‌లతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సు సెంటర్లు వెలుస్తున్నాయి. 
ఫిట్‌నెస్‌కు ప్రత్యేక ప్రొగ్రామ్స్‌  

► మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రొగ్రామ్స్‌ను అమలు చేస్తున్నారు. నిర్ధేశిత సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఫిట్‌నెస్‌కు ప్రయత్నిస్తున్నారు. 

► గర్భిణులు ప్రసవం ముందు, ప్రసవం తర్వాత పెల్విస్‌ ఫ్లోర్‌ మజిల్స్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సుఖప్రసవం జరిగేలా మజిల్స్‌ను సిద్ధంచేయడంతో పాటు ప్రసవం తర్వాత చర్మం యథాస్థితికి చేరుకునేందుకు పోస్ట్‌నేటల్‌ పెల్విస్‌ ఫ్లోర్‌ మజిల్స్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ ఎంతగానో దోహదం చేస్తుంది. 

► ప్రస్తుతం హార్మోన్ల లోపంతో సంతానలేమితో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారు మందులు వాడాల్సిన అవసరం లేకుండా వ్యాయామం, ఒత్తిడిని అధిగమించే టెక్నిక్స్, మెడిటేషన్‌ ద్వారా హార్మోన్స్‌ సమతుల్యంగా ఉండేలా చూస్తున్నారు. ఇవి చాలా మందిలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. 

► పిల్లల్లో అధికశాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. అలాంటి వారికోసం అనేక వ్యాయామాలతో పాటు క్రీడల్లో భాగస్వామ్యం కల్పించేలా పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. 
జ పీసీఓడీ సమస్యతో నెలసరి సరిగా రాని వారికి లైఫ్‌ స్టయిల్‌ మోడిఫికేషన్, వ్యాయామం, యోగా, మెడిటేషన్‌ వంటి పక్రియల ద్వారా సక్రమంగా వచ్చేలా చేయవచ్చునని వైద్యులు చెపుతున్నారు. 

► అధిక బరువులో బాధపడుతున్న మహిళలు ఏరోబిక్‌పై ఆసక్తి చూపుతున్నారు. రోజుకి 20 నుంచి 35 నిమిషాలు ఎరోబిక్‌ చేయడం ద్వారా వెయిట్‌లాస్‌తో పాటు, ఒత్తిడిని అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

► జుంబా డ్యాన్స్‌పై ప్రస్తుతం యువతలో క్రేజ్‌ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారు జుంబా డ్యాన్స్‌ చేస్తున్నారు. అధిక బరువుతో బాధపడే వారు జుంబా డ్యాన్స్‌ చేయడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు. 

వ్యాయామంతో ఎన్నో ఉపయోగాలు
వ్యాయామం, ఏరోబిక్‌ చేయడం ద్వారా ఫిట్‌నెస్‌తో పాటు, ఒత్తిడిని అధిగమించవచ్చు. మెడిటేషన్, యోగాపై సైతం మహిళలు దృష్టి సారిస్తే  క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు, అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.గర్భిణులు సుఖప్రసవం కోసం ప్రీనేటల్, పోస్ట్‌నేటల్‌ పెల్విస్‌ ప్లోర్‌ వ్యాయామంపై మహిళలకు మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రసవం అనంతరం శరీర ఆకృతిలో మార్పులను నివారించేందుకు మంచి వ్యాయామ పద్ధతులు ఉన్నాయి.                                  
– డాక్టర్‌ వీబీ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement