కర్నూలు (రాజ్‌విహార్) : న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల ఆందోళనలను అడ్డుకొని అరెస్టు చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో మహిళా కార్మిక వ్యతిరేకిగా మిగిలిపోతారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి. షడ్రక్ ఆరోపించారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో శాంతియుతంగా ధర్నా చేపట్టి, చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న మహిళా, అంగన్‌వాడీ, సీఐటీయూ నాయకులను పోలీసులతో అరెస్టు చేయించడం అన్యాయమన్నారు.
దీర్ఘ కాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని, అయితే, తన నిరంకుశ వైఖరిని మార్చుకోని చంద్రబాబు మహిళలు అని కూడా చూడకుండా అరెస్టు చేయించి పోలీసు స్టేషన్లకు తరిలించడం విచారకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వేతనాలకు నోచుకోకుండా అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలు చేస్తున్న వెట్టిచాకిరి ప్రభుత్వానికి కన్పించడం లేదా అన్ని ప్రశ్నించారు.
అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు కార్మికులకు భద్రత కరువైందని చెప్పారు. అనంతరం ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప తమ మద్దతు ప్రకటించి మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామాం జనేయులు, రాధాకృష్ణ, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు వాణి, కోమల, ఇతర నాయకురాళ్లు పాల్గొన్నారు. కాగా.. అంగన్‌వాడీ కార్యకర్తలు, అయాలపై పోలీసుల లాఠి చార్జీ అమానుషం అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళా కార్మిక వ్యతిరేకి చంద్రబాబు
Published Wed, Mar 18 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement