గరిష్ట భూపరిమితి తగ్గించడం కుదరదు
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయ గరిష్ట భూ పరిమితి (ల్యాండ్ సీలింగ్) చట్టానికి కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ గరిష్ట భూపరిమితిని 5 -15 ఎకరాలకు తగ్గించాలంటూ జాతీయ భూ సంస్కరణల విధాన ముసాయిదాలో పేర్కొన్న ప్రతిపాదనను వ్యతిరేకించాలని నిర్ణయించింది. జాతీయ భూ సంస్కరణల విధాన ముసాయిదాపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు.
సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మీడియాకు వివరించారు. ‘‘భూగరిష్ట పరిమితిని తగ్గించడంవల్ల చిన్న కమతాలు పెరిగిపోయి యాంత్రికీకరణకు సమస్యవుతుంది. దీనివల్ల వ్యవసాయం మరింత గిట్టుబాటుకాని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ భూ గరిష్ట పరిమితి తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేదని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించింది’’ అని రఘువీరారెడ్డి తెలిపారు.