చంద్రబాబు ఓ కరప్షన్ మహారాజు
బాబు అవినీతిపై తీవ్రంగా ధ్వజమెత్తిన వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం/ కాకినాడ: ‘‘అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్న కరప్షన్ మహారాజు చంద్రబాబు. రాష్ట్రంలో అవినీతి సొమ్ము సంపాదించి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లతో పక్కరాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారు. తప్పుచేసి దొరికిపోయిన తరువాత సెక్షన్-8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ధవళేశ్వరం ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారం విశాఖకు వచ్చిన జగన్ విలేకరులతో మాట్లాడారు.
ఆ తర్వాత జగన్ తూర్పుగోదావరి జిల్లా తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. తొండంగి మండలం పెరుమాళ్ళపురం, హుకుంపేట, యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో వేటకు వెళ్ళి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఓదార్చారు. తొలుత పెరుమాళ్ళపురం సెంటర్‌లో తీరప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మత్స్యకారులనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లో.... ఈ రాష్ట్రంలో సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు.
పట్టపగలు డబ్బుతో ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఆ మర్నాడే విజయవాడ వచ్చి.. అవినీతిరహిత రాష్ట్రం చేస్తానని చిన్నపిల్లలతో ప్రమాణం చేయిస్తాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా? డబ్బుకట్టలతో పట్టుబడి దానిని తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్-8, ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నాడు. వారి పార్టీ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి విభజన చట్టంలో సెక్షన్-8 ఓ భాగం మాత్రమే. మొత్తం విభజన చట్టాన్నే అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఇందుకోసం నాలుగుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలసి కోరాం.
రాష్ట్రం విడిపోయి 13 నెలలు అయిన తరువాత ఆ రాష్ట్రంలో మేం ఎవరికి మద్దతిస్తే ఏంటి? ప్రజలను తప్పుదారి పట్టించేందుకే సెక్షన్-8ను చంద్రబాబు లేవనెత్తారు. ఇక్కడకు వచ్చేటప్పుడే కాకినాడ సెజ్ భూముల గురించి నాకు అర్జీ ఇచ్చారు. కాకినాడ సెజ్‌కు 2002లో జీవో ఇచ్చింది చంద్రబాబే. కానీ ఎన్నికలకు ముందు ఆ భూముల్లో ఏరువాక సాగించారు. ఈ భూములన్నీ జగన్‌వేనని చెప్పారు. ఇప్పుడు నేనే చెప్తున్నా... ఈ భూములన్నీ రైతులకు వెనక్కు ఇచ్చేయండి చంద్రబాబూ! రైతులకు ఎకరాకు రూ.3 లక్షలిచ్చి, ఇప్పుడు ఎకరా రూ.70 లక్షలకు అమ్ముకుంటున్నారు.
అందుకే రైతుకు రూ.70 లక్షలు ఇవ్వండి లేదా భూములు తిరిగి ఇవ్వండని డిమాండ్ చేస్తున్నా. చివరకు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలో బాబు ఇదే మోసం చేస్తున్నాడు. 60 రోజుల పాటు వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సెలవుదినాలుగా ప్రకటించారు. ఆరోజులకు మీ అందరికీ 50 కేజీల బియ్యం, రూ.నాలుగు వేలు ఇస్తానన్నాడు. 40మంది మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైతే హెలికాప్టర్లు పెట్టి వెతికిస్తామన్నారు. వారిలో 17మంది చనిపోగా మిగిలినవారు కొన ఊపిరితో ఇంటికి చేరుకున్నారు. వారికి దమ్మిడీ ఇచ్చిన పాపానపోలేదు. వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడటానికి రాలేదు. ఇటువంటి నాయకుడ్ని ప్రజలు బంగాళాఖాతంలో విసిరేసే రోజు దగ్గర్లోనే ఉంది.
4 రోజుల్లో పరిహారం అందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం
* ధవళేశ్వరం ప్రమాద మృతుల కుటుంబాలకు జగన్ ఓదార్పు
సాక్షి, విశాఖపట్నం/అచ్యుతాపురం: ధవళేశ్వరం ప్రమాదాన్ని ఓ పెనువిపత్తుగా పరిగణించి మృతుల్లో ఒక్కొక్కరికీ రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయకుంటే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాను అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఒకే ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా పరామర్శించడానికి ముఖ్యమంత్రికి తీరికేలేదా? అని ప్రశ్నించారు.
గత నెల 12వ తేదీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై నుంచి గోదావరి నదిలోకి తుఫాన్ వాహనం పల్టీ కొట్టిన ప్రమాదంలో విశాఖ జిల్లా మోసయ్యపేటకు చెందిన 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాద బాధిత కుటుంబాలను జగన్ గురువారం పరామర్శించారు. ఆయన మోసయ్యపేటలోని ఈగల వెంకులు ఇంటికి వచ్చారు. ధవళేశ్వరం ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన ఐదు కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నేతలు అక్కడికి తీసుకొచ్చారు.
ప్రమాదంలో మొత్తం 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయిన ఈగల వెంకులు జగన్‌ను చూసేసరికి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలిన పదేళ్ల కిరణ్‌సాయిని జగన్ దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. హుదూద్ తుపాను మృతుల కుటుంబాలకు ఇచ్చినట్లే ఈ ప్రమాద మృతుల కుటుంబసభ్యులకూ ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.