Paramarsa
-
మైనార్టీలపై టీడీపీ దాడి
-
మైనార్టీలపై టీడీపీ దాడి
సాక్షి, పిడుగురాళ్ల: గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో ఉద్రిక్తత నెలకొంది. మైనార్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు అంటి రాంబాబు, ఎల్.అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్‌లు పరామర్శించారు. పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు. -
చెట్లకు కట్టారు.. రాళ్లతో కొట్టారు..
ఆవులను చంపుతున్నారన్నది అపోహ కాదు పథకం ప్రకారమే దాడి చేశారు ఏం జరిగిందో చెప్పే అవకాశం ఇవ్వలేదు పోలీసుల ఎదుటే చితకబాదారు జగన్ ఎదుట సూదాపాలెం బాధిత దళితుల ఆవేదన ఆస్పత్రిలో బాధితులకు వైఎస్సార్సీపీ అధినేత పరామర్శ అండగా ఉంటానని భరోసా అమలాపురం టౌన్ : ‘అర్ధరాత్రి.. కటిక చీకట్లో చెట్లకు కట్టి రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. తర్వాత మోకాళ్లపై నిలబెట్టి చెప్పులతో కొట్టారు. అసలు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా రాళ్లు, కర్రలతో చితకబాదారు’ అని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం ఘటనలో తీవ్రంగా గాయపడిన దళిత బాధితులు వైఎస్సార్సీపీ అధినేత, శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చర్మకారులైన మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు, సవరపు లక్ష్మణకుమార్, మోకాటి ప్రేమ్‌లను జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటిగంటకు కారులో అమలాపురం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఒక్కో బాధితుని మంచంవద్ద జగన్మోహన్రెడ్డి పావుగంట సేపు ఉండి, వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. బాధితులు, వారి కుటుంబీకులతో మమేకమై అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాయపడ్డవారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని వారితో మాట్లాడారు. అంతా పథకం ప్రకారమే.. దాడిలో గాయపడ్డ ఎలీషాను తొలుత జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. దాడి ఎలా జరిగిందని ఆరా తీశారు. ఆవులను అపహరించి వధిస్తున్నారని అపోహ పడే దాడి చేశారని చెప్పటం వాస్తవం కాదని, పక్కా పథకం ప్రకారమే దాడి చేశారని.. గొడవ పెద్దదవడంతో అపోహ పడ్డామన్న కట్టుకథ అల్లారని ఎలీషా, అతని భార్య లీలావతి, కుమారులు చంటిబాబు, చిట్టిబాబులు వివరించారు. చనిపోయిన ఆవును మాత్రమే తాము తీసుకువచ్చి చర్మం తీస్తున్నామని ఎంత చెబుతున్నా వినకుండా దాడి చేశారని చెప్పారు. అపోహ అనే మాటను పదేపదే చెప్పి, దాడిని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రికి కాకుండా స్టేషన్‌కు తీసుకువెళ్లారు ‘చెట్లకు కట్టేసి రాళ్లతో కొట్టిన తరువాత సమాచారం అందుకుని సూదాపాలెం శ్మశానానికి పోలీసులు వచ్చారు. ఆలోగా విషయం తెలిసి మా బంధువులమంతా అక్కడికి వెళ్లాం. పోలీసులు వచ్చిన తర్వాత కూడా మావాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టి మళ్లీ చితకబాదారు’ అని గాయపడ్డ రెండో బాధితుడు మోకాటి వెంకటేశ్వరరావు, భార్య సత్యనారాయణమ్మ, కుమారులు జగన్మోహన్రెడ్డితో చెప్పారు. తలలు, కాళ్లకు తీవ్రగాయాలై ఉన్న తమను ముందు ఆస్పత్రికి కాకుండా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ గంటన్నరసేపు ఉంచారని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతసేపూ తాము రక్తం కారుతున్న దెబ్బలతోనే ఉన్నామన్నారు. తమ కుల పెద్దలు స్టేషన్‌కు వచ్చి జామీను ఇస్తేనే ఆస్పత్రికి తరలించారని చెప్పారు. వ్యాన్‌లో గొడ్లను పడేసినట్లు పడేశారు వ్యాన్‌లో గొడ్లను తరలించినట్టుగా పడేసి గాయపడ్డ తమను స్టేషన్‌కు తీసుకు వచ్చారని వెంకటేశ్వరరావు కుమారుడు రాజు.. జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిలో స్వల్పంగా గాయపడ్డ సవరపు లక్ష్మణకుమార్, పదో తరగతి చదువుతున్న మోకాటి ప్రేమ్‌ను కూడా జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బాలుడని కూడా చూడకుండా తనపై ఆటవికంగా దాడి చేశారని ఆ బాలుడు చెబుతూంటే జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ‘ఇంత దారుణమా..? ఇంత దౌర్జన్యమా..? అని ఆయన కూడా ఆవేదన చెందారు. అమలాపురంలో అరవింద్ అనే రైతుకు చెందిన ఆవు చనిపోతే ఆయన అనుమతితోనే తెచ్చి దాని చర్మాన్ని ఒలుస్తున్నామని చెబుతున్నా.. ఆ రైతు అరవింద్‌కు ఫోన్ చేసి ఆయనతోనే మాట్లాడాలని ఫోన్ ఇస్తున్నా దాడి చేసినవారు పట్టించుకోకుండా రాళ్లు, చెప్పులతో కొట్టారని బాధితులు జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. బాధితులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. బాధితులకు రావాల్సిన రూ.8.25 లక్షలు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. -
మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
చంద్రబాబును అరెస్ట్ చేయకపోవటం దారుణం: వైఎస్ జగన్
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తుఫాన్ కారణంగా మృతి చెందిన మత్స్యకారుడు పి.వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన శుక్రవారం పర్లోపేటలో పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇన్నిరోజులు అయినా మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. మత్స్యకారుల ప్రాణాలను చంద్రబాబే తీశారని, వాతావరణ పరిస్థితులపై కనీస హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఎలాంటి సాయం అందటం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే సెక్షన్-8 ఎందుకు అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్-8 అన్నది ఒక భాగం మాత్రమే అని వైఎస్ జగన్ అన్నారు. చట్టంలో హామీలు అమలు చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను పలుమార్లు కలిశామని, మొత్తం చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినట్లు వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఇప్పుడు సెక్షన్-8 అంటున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. లంచాలు తీసుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నిస్తున్నారని, బహుశా దేశచరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇవ్వడానికి యత్నించి పట్టుబడ్డారని, నల్లధనంతో వారిని కొనుగోలు చేయడానికి నేరుగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడరని, వీడియోల్లో దొరికినా చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. సిగ్గుమాలిన చంద్రబాబు...ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సెక్షన్-8 ప్రస్తావిస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎన్డీ తివారీ విషయంలో చెప్పిన నీతిని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆచరించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీ తివారీకి ఓ నీతి...చంద్రబాబుకు మరో నీతా అని వైఎస్ జగన్ నిలదీశారు. అనంతరం ఆయన కాకినాడ జగన్నాథపురం బయల్దేరి వెళ్లారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తదుపరి కాకినాడరూరల్ నియోజకవర్గం పగడాలపేట వెళతారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కాకినాడ నుంచి బయలుదేరి ఏజెన్సీలోని గంగవరం మండలం పాతరామవరం చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. పాతరామవరం నుంచి పి. నెల్లిపూడి, సీహెచ్. నెల్లిపూడి, కొత్త నెల్లిపూడి మీదుగా కొత్తాడ చేరుకుంటారు. కొత్తాడలో మృతుడు శారపు అబ్బులుదొర కుటుంబాన్ని ఆయన ఓదారుస్తారు. అనంతరం కొత్తాడ నుంచి సూరంపాలెం చేరుకొని ఎనిమిది మంది మృతుల కుటుంబాలను , క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం సూరంపాలెం రిజర్వాయర్ సమీపంలో రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. -
చంద్రబాబు ఓ కరప్షన్ మహారాజు
బాబు అవినీతిపై తీవ్రంగా ధ్వజమెత్తిన వైఎస్ జగన్ సాక్షి, విశాఖపట్నం/ కాకినాడ: ‘‘అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్న కరప్షన్ మహారాజు చంద్రబాబు. రాష్ట్రంలో అవినీతి సొమ్ము సంపాదించి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లతో పక్కరాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారు. తప్పుచేసి దొరికిపోయిన తరువాత సెక్షన్-8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ధవళేశ్వరం ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారం విశాఖకు వచ్చిన జగన్ విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత జగన్ తూర్పుగోదావరి జిల్లా తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. తొండంగి మండలం పెరుమాళ్ళపురం, హుకుంపేట, యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో వేటకు వెళ్ళి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఓదార్చారు. తొలుత పెరుమాళ్ళపురం సెంటర్లో తీరప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మత్స్యకారులనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లో.... ఈ రాష్ట్రంలో సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు. పట్టపగలు డబ్బుతో ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఆ మర్నాడే విజయవాడ వచ్చి.. అవినీతిరహిత రాష్ట్రం చేస్తానని చిన్నపిల్లలతో ప్రమాణం చేయిస్తాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా? డబ్బుకట్టలతో పట్టుబడి దానిని తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్-8, ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నాడు. వారి పార్టీ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి విభజన చట్టంలో సెక్షన్-8 ఓ భాగం మాత్రమే. మొత్తం విభజన చట్టాన్నే అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఇందుకోసం నాలుగుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలసి కోరాం. రాష్ట్రం విడిపోయి 13 నెలలు అయిన తరువాత ఆ రాష్ట్రంలో మేం ఎవరికి మద్దతిస్తే ఏంటి? ప్రజలను తప్పుదారి పట్టించేందుకే సెక్షన్-8ను చంద్రబాబు లేవనెత్తారు. ఇక్కడకు వచ్చేటప్పుడే కాకినాడ సెజ్ భూముల గురించి నాకు అర్జీ ఇచ్చారు. కాకినాడ సెజ్‌కు 2002లో జీవో ఇచ్చింది చంద్రబాబే. కానీ ఎన్నికలకు ముందు ఆ భూముల్లో ఏరువాక సాగించారు. ఈ భూములన్నీ జగన్‌వేనని చెప్పారు. ఇప్పుడు నేనే చెప్తున్నా... ఈ భూములన్నీ రైతులకు వెనక్కు ఇచ్చేయండి చంద్రబాబూ! రైతులకు ఎకరాకు రూ.3 లక్షలిచ్చి, ఇప్పుడు ఎకరా రూ.70 లక్షలకు అమ్ముకుంటున్నారు. అందుకే రైతుకు రూ.70 లక్షలు ఇవ్వండి లేదా భూములు తిరిగి ఇవ్వండని డిమాండ్ చేస్తున్నా. చివరకు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలో బాబు ఇదే మోసం చేస్తున్నాడు. 60 రోజుల పాటు వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సెలవుదినాలుగా ప్రకటించారు. ఆరోజులకు మీ అందరికీ 50 కేజీల బియ్యం, రూ.నాలుగు వేలు ఇస్తానన్నాడు. 40మంది మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైతే హెలికాప్టర్లు పెట్టి వెతికిస్తామన్నారు. వారిలో 17మంది చనిపోగా మిగిలినవారు కొన ఊపిరితో ఇంటికి చేరుకున్నారు. వారికి దమ్మిడీ ఇచ్చిన పాపానపోలేదు. వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడటానికి రాలేదు. ఇటువంటి నాయకుడ్ని ప్రజలు బంగాళాఖాతంలో విసిరేసే రోజు దగ్గర్లోనే ఉంది. 4 రోజుల్లో పరిహారం అందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం * ధవళేశ్వరం ప్రమాద మృతుల కుటుంబాలకు జగన్ ఓదార్పు సాక్షి, విశాఖపట్నం/అచ్యుతాపురం: ధవళేశ్వరం ప్రమాదాన్ని ఓ పెనువిపత్తుగా పరిగణించి మృతుల్లో ఒక్కొక్కరికీ రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయకుంటే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాను అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఒకే ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా పరామర్శించడానికి ముఖ్యమంత్రికి తీరికేలేదా? అని ప్రశ్నించారు. గత నెల 12వ తేదీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై నుంచి గోదావరి నదిలోకి తుఫాన్ వాహనం పల్టీ కొట్టిన ప్రమాదంలో విశాఖ జిల్లా మోసయ్యపేటకు చెందిన 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాద బాధిత కుటుంబాలను జగన్ గురువారం పరామర్శించారు. ఆయన మోసయ్యపేటలోని ఈగల వెంకులు ఇంటికి వచ్చారు. ధవళేశ్వరం ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన ఐదు కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి తీసుకొచ్చారు. ప్రమాదంలో మొత్తం 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయిన ఈగల వెంకులు జగన్‌ను చూసేసరికి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలిన పదేళ్ల కిరణ్‌సాయిని జగన్ దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. హుదూద్ తుపాను మృతుల కుటుంబాలకు ఇచ్చినట్లే ఈ ప్రమాద మృతుల కుటుంబసభ్యులకూ ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
చెదిరిన గుండె లకు..కొండంత ఓదార్పు
జిల్లాలో పర్యటించిన జననేత జగన్ బాధిత మత్స్యకార కుటుంబాలకు పరామర్శ వారిపట్ల సర్కారు ఉదాసీనతపై ఆగ్రహం తాము అండగా ఉంటామని భరోసా సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం కారణంగా మృతి చెందిన, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను గురువారం జగన్ ఓదార్చారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేటలో పర్యటన ముగించుకొని సాయంత్రం 5 గంటలకు జగన్ తుని వచ్చారు. ఈ సందర్భంగా తాండవ బ్రిడ్జిపై జగన్‌కు పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన పర్యటన అన్నవరం, గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, తొండంగి, వంటిమామిడి, కొత్తపాకల, గడ్డి పేట, బుచ్చియ్యపేటల మీదుగా పెరుమాళ్లపురం, హుకుంపేట, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడల మీదుగా సాగింది. అడుగడుగునా తీర ప్రాంత మత్స్యకారులు అభిమానంతో జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడి పలకరించారు. కొత్తపాకలలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిలువెత్తు విగ్రహానికి జగన్ పూలమాలలువేసి నివాళులు అర్పించారు. గడ్డిపేటలో కాకినాడ ఎస్ఈజడ్ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలసి జగన్‌కు నివేదికను అందజేశారు. తగిన పరిహారం ఇవ్వకుంటే భూములు తిరిగివ్వండి.. పెరుమాళ్లపురం బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం తీర ప్రాంత మత్స్యకారుల్లో భరోసానిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాష్ట్రమంత్రులు బాధిత మత్స్యకారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారంటూ జగన్ నిప్పులు చెరిగిన సమయంలో స్థానికులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేశారు. కాకినాడ సెజ్ విషయంలో ముఖ్యమంత్రి కాకముందు, అయ్యాక చంద్రబాబు వ్యవహారశైలిని జగన్ ఎండగట్టారు. ‘ఎకరానికి రూ.70 లక్షలు అయినా ఇవ్వండి, లేదా రైతుల భూములు వారికి వెనక్కి ఇచ్చేయండి’ అని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుమాళ్లపురం సెంటరు జగన్ కోసం తరలి వచ్చిన మత్స్యకారులతో కిక్కిరిసిపోయింది. అక్కడ నుంచి ఆయన పాత పెరుమాళ్లపురానికి చెందిన చొక్కా రాజు, చొక్కా పెంటయ్య, సింహాచలం, మేరుగ బాబూరావు కుటుంబాలను పలకరించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ‘మీ వెంట మేముంటామని’ వారికి భరోసా కల్పించారు. అనంతరం హుకుంపేటలో తిత్తి అప్పలరాజు, అత్తిలి రాజుబాబు, కోడా లోవరాజు కుటుంబాలను ఓదార్చారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం మత్స్యకార గ్రామాల్లో పంతాడ సూరిబాబు, పట్టా సూర్యారావు కుటుంబాలను పలకరించి పార్టీ తరఫున మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఉప్పాడ నుంచి బీచ్‌రోడ్డు మీదుగా జగన్ అర్ధరాత్రి 12.18 గంటలకు కాకినాడ చేరుకుని, బస చేశారు. జగన్ నేటి పర్యటన వివరాలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు కాకినాడ దేవాలయంవీధిలోని పార్టీ నాయకులు నిర్మల్ జైన్ నివాసం నుంచి బయలుదేరి బాలాజీ చెరువు, పైండా సత్తిరాజు బాలికోన్నత పాఠశాల, కల్పనా సెంటర్, ప్లై ఓవర్ మీదుగా పర్లోపేట వెళతారు. అక్కడ తుఫాన్ కారణంగా మృతి చెందిన మత్స్యకారుని కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడినుంచి కాకినాడ జగన్నాథపురం వెళ్లి ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తదుపరి కాకినాడరూరల్ నియోజకవర్గం పగడాలపేట వెళతారు. అనంతరం జగన్మోహన్రెడ్డి కాకినాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు జిల్లా ఏజెన్సీలోని గంగవరం మండలం పాతరామవరం చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. పాతరామవరం నుంచి పి. నెల్లిపూడి, సీహెచ్. నెల్లిపూడి, కొత్త నెల్లిపూడి మీదుగా కొత్తాడ చేరుకుంటారు. కొత్తాడలో మృతుడు శారపు అబ్బులుదొర కుటుంబాన్ని ఆయన ఓదారుస్తారు. అనంతరం కొత్తాడ నుంచి సూరంపాలెం చేరుకొని ఎనిమిది మంది మృతుల కుటుంబాలను , క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం సూరంపాలెం రిజర్వాయర్ సమీపంలో రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు.