చెట్లకు కట్టారు.. రాళ్లతో కొట్టారు..
-
ఆవులను చంపుతున్నారన్నది అపోహ కాదు
-
పథకం ప్రకారమే దాడి చేశారు
-
ఏం జరిగిందో చెప్పే అవకాశం ఇవ్వలేదు
-
పోలీసుల ఎదుటే చితకబాదారు
-
జగన్ ఎదుట సూదాపాలెం బాధిత దళితుల ఆవేదన
-
ఆస్పత్రిలో బాధితులకు వైఎస్సార్‌సీపీ అధినేత పరామర్శ
-
అండగా ఉంటానని భరోసా
అమలాపురం టౌన్ :
‘అర్ధరాత్రి.. కటిక చీకట్లో చెట్లకు కట్టి రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. తర్వాత మోకాళ్లపై నిలబెట్టి చెప్పులతో కొట్టారు. అసలు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా రాళ్లు, కర్రలతో చితకబాదారు’ అని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం ఘటనలో తీవ్రంగా గాయపడిన దళిత బాధితులు వైఎస్సార్‌సీపీ అధినేత, శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చర్మకారులైన మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వరరావు, సవరపు లక్ష్మణకుమార్, మోకాటి ప్రేమ్‌లను జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటిగంటకు కారులో అమలాపురం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఒక్కో బాధితుని మంచంవద్ద జగన్‌మోహన్‌రెడ్డి పావుగంట సేపు ఉండి, వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. బాధితులు, వారి కుటుంబీకులతో మమేకమై అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాయపడ్డవారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని వారితో మాట్లాడారు.
అంతా పథకం ప్రకారమే..
దాడిలో గాయపడ్డ ఎలీషాను తొలుత జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. దాడి ఎలా జరిగిందని ఆరా తీశారు. ఆవులను అపహరించి వధిస్తున్నారని అపోహ పడే దాడి చేశారని చెప్పటం వాస్తవం కాదని, పక్కా పథకం ప్రకారమే దాడి చేశారని.. గొడవ పెద్దదవడంతో అపోహ పడ్డామన్న కట్టుకథ అల్లారని ఎలీషా, అతని భార్య లీలావతి, కుమారులు చంటిబాబు, చిట్టిబాబులు వివరించారు. చనిపోయిన ఆవును మాత్రమే తాము తీసుకువచ్చి చర్మం తీస్తున్నామని ఎంత చెబుతున్నా వినకుండా దాడి చేశారని చెప్పారు. అపోహ అనే మాటను పదేపదే చెప్పి, దాడిని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.
ఆస్పత్రికి కాకుండా స్టేషన్‌కు తీసుకువెళ్లారు
‘చెట్లకు కట్టేసి రాళ్లతో కొట్టిన తరువాత సమాచారం అందుకుని సూదాపాలెం శ్మశానానికి పోలీసులు వచ్చారు. ఆలోగా విషయం తెలిసి మా బంధువులమంతా అక్కడికి వెళ్లాం. పోలీసులు వచ్చిన తర్వాత కూడా మావాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టి మళ్లీ చితకబాదారు’ అని గాయపడ్డ రెండో బాధితుడు మోకాటి వెంకటేశ్వరరావు, భార్య సత్యనారాయణమ్మ, కుమారులు జగన్‌మోహన్‌రెడ్డితో చెప్పారు. తలలు, కాళ్లకు తీవ్రగాయాలై ఉన్న తమను ముందు ఆస్పత్రికి కాకుండా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ గంటన్నరసేపు ఉంచారని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతసేపూ తాము రక్తం కారుతున్న దెబ్బలతోనే ఉన్నామన్నారు. తమ కుల పెద్దలు స్టేషన్‌కు వచ్చి జామీను ఇస్తేనే ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
వ్యాన్‌లో గొడ్లను పడేసినట్లు పడేశారు
వ్యాన్‌లో గొడ్లను తరలించినట్టుగా పడేసి గాయపడ్డ తమను స్టేషన్‌కు తీసుకు వచ్చారని వెంకటేశ్వరరావు కుమారుడు రాజు.. జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిలో స్వల్పంగా గాయపడ్డ సవరపు లక్ష్మణకుమార్, పదో తరగతి చదువుతున్న మోకాటి ప్రేమ్‌ను కూడా జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బాలుడని కూడా చూడకుండా తనపై ఆటవికంగా దాడి చేశారని ఆ బాలుడు చెబుతూంటే జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ‘ఇంత దారుణమా..? ఇంత దౌర్జన్యమా..? అని ఆయన కూడా ఆవేదన చెందారు.
అమలాపురంలో అరవింద్ అనే రైతుకు చెందిన ఆవు చనిపోతే ఆయన అనుమతితోనే తెచ్చి దాని చర్మాన్ని ఒలుస్తున్నామని చెబుతున్నా.. ఆ రైతు అరవింద్‌కు ఫోన్ చేసి ఆయనతోనే మాట్లాడాలని ఫోన్ ఇస్తున్నా దాడి చేసినవారు పట్టించుకోకుండా రాళ్లు, చెప్పులతో కొట్టారని బాధితులు జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. బాధితులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. బాధితులకు రావాల్సిన రూ.8.25 లక్షలు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.